రాహుల్ ఎడ్యుకేష‌న్‌!..డిగ్రీ త‌ర్వాత నేరుగా ఎంఫీల్‌!

Update: 2019-04-20 13:44 GMT
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్ప‌టికే కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ లో నామినేష‌న్ దాఖ‌లు చేసిన రాహుల్ తాజాగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అమేధీలోనూ నామినేష‌న్ దాఖలు చేశారు. వ‌య‌నాడ్ లో రేకెత్త‌ని వివాదం అమేధీలో త‌లెత్తింది. అదేంటంటే... రాహుల్ విద్యార్హ‌త‌ల‌కు సంబంధించిన వివాదం. గ‌తంలోనూ అమేథీలోనే పోటీ చేస్తూ వ‌చ్చిన రాహుల్ గాంధీ.. ఏనాడూ పెద్ద‌గా వివాదం రేకెత్త‌లేదు. అయితే ఈ ద‌ఫా మాత్రం రాహుల్ త‌న విద్యార్హ‌త‌ల‌కు సంబంధించి పెద్ద వివాదంలోనే చిక్కుకున్న‌ట్లుగా తెలుస్తోంది. రాహుల్ స‌మ‌ర్పించిన నామినేష‌న్ ప‌త్రాలు ప‌రిశీలించిన రిట‌ర్నింగ్ అధికారి రాహుల్ విద్యార్హ‌త‌ల్లో కొంత క‌న్ఫ్యూజ‌న్ ఉంద‌ని - దానికి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరారట‌.

అయితే ఇలాంటి చిన్న చిన్న విష‌యాల‌ను అప్ప‌టిక‌ప్పుడు క్లారిఫై చేయాల్సి ఉండ‌గా.. రాహుల్ గాంధీ న్యాయ‌వాది మాత్రం సోమ‌వారం వ‌ర‌కు గ‌డువు కోరార‌ట‌. దీంతో విష‌యం తెలుసుకున్న బీజేపీ దీనిని మ‌రింత‌గా ఎన్ లైట్ చేస్తూ పెద్ద ర‌భ‌స చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ వ్య‌వ‌హారంపై మీడియా ముందుకు వ‌చ్చిన బీజేపీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విద్యార్హ‌త‌ల విష‌యంలోనే కాకుండా పౌర‌స‌త్వంపైనా రాహుల్ మీద చాలా వివాదాలున్నాయ‌ని జీవీఎల్ ఆరోపించారు. 1994లో డిగ్రీ చేసిన‌ట్లుగా చెబుతున్న రాహుల్ గాంధీ... ఆ వెంట‌నే 1995లో ఎంఫిల్‌ చేసినట్టు అఫిడవిట్లలో పేర్కొన్నట్లుగా తెలిపారు. డిగ్రీ తర్వాత పీజీ చేయకుండా ఎంఫిల్ ఎలా చేస్తారో రాహుల్‌ కే తెలియాలని సెటైర్ సంధించారు. ఇక రాహుల్ ఎంఫిల్ డిగ్రీపైనా జీవీఎల్ అనుమానాలు వ్య‌క్తం చేశారు. డెవలప్ మెంట్‌ ఎకనామిక్స్‌లో ఎంఫిల్ చేసినట్టు ఓసారి చెప్పిన రాహుల్‌... డెవలప్ మెంట్‌ స్టడీస్‌లో ఎంఫిల్‌ చేసినట్టు మరోసారి పేర్కొన్నారని తెలిపారు.

ఇక తాను బ్రిటీష్ కంపెనీలో డైరక్టర్‌ గా ఉన్నట్టు కూడా రాహుల్‌ ఓసారి పేర్కొన్నారని ప్ర‌స్తావించిన జీవీఎల్‌... ఆ కంపెనీ ఇచ్చిన వివరాల్లో రాహుల్ ను బ్రిటీష్ పౌరుడిగా వెల్లడించారని తెలిపారు. దీనిపై రాహుల్ నుంచి ఇప్ప‌టిదాకా ఎలాంటి వివ‌ర‌ణ లేద‌ని కూడా జీవీఎల్ ఆరోపించారు. అయితే ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నిక‌ల సంఘం వివరణ అడిగిందని పేర్కొన్న జీవీఎల్‌... ఇప్పుడైనా రాహుల్ సరైన వివరణ ఇస్తారా లేక తప్పించుకుని పారిపోతారా చూడాలని వ్యాఖ్యానించారు. మొత్తంగా నామినేష‌న్ లో స‌రైన వివ‌రాలు ఇవ్వ‌కుండా రాహుల్ గాంధీ త‌న‌ను తాను వివాదంలో నెట్టుకున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News