కాంగ్రెస్ నుంచి రాహుల్‌ను తొల‌గించండి: బీజేపీ డిమాండ్‌.. రీజ‌న్ ఏంటంటే!

Update: 2022-12-17 15:30 GMT
కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీని ఆ పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని.. తొల‌గించాల‌ని బీజేపీ నేత‌లు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. కాంగ్రెస్‌కు ఈ దేశంపై ఏ మాత్రం అభిమానం ఉన్నా.. వెంట‌నే రాహుల్‌ను తొల‌గించాల‌ని బీజేపీ నాయ‌కులు డిమాండ్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్ర‌స్తుతం జాతీయ‌స్థాయిలో ఈ వివాదం ర‌గులుతోంది.

ఏం జ‌రిగింది?

ప్ర‌స్తుతం జోడో యాత్ర‌లో ఉన్న రాహుల్ కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. డ్రాగ‌న్ కంట్రీ.. చైనా భార‌త్‌పైకి యుద్ధానికి సిద్ధమవుతుంటే మోడీ ప్రభుత్వం నిద్ర పోతోందా? అని రాహుల్ ప్ర‌శ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత‌లు విమర్శలు సంధించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో సైనికులు దెబ్బలు కాస్తున్నారని, అలాంటి ఆర్మీ నైతికతను దెబ్బతీసేలా రాహుల్ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్‌ను తొలగించాలని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖర్గే నిజంగా రిమోట్‌ కంట్రోల్డ్‌ అధ్యక్షుడు కాకపోతే.. వెంటనే రాహుల్‌ను పార్టీ నుంచి తొలగించాలని భాటియా డిమాండ్‌ చేశారు. విపక్ష పార్టీ దేశం పక్షాన ఉంటే వెంటనే పార్టీ నుంచి రాహుల్‌ను బహిష్కరించాలన్నారు.

ఒకవేళ రాహుల్‌ గాంధీని తొలగించకపోతే ఆయనే పార్టీని ముందుండి నడిపిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుందన్నారు. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు ఆ పార్టీ వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కాంగ్రెస్‌ అడ్డాగా మారిందని దుయ్యబట్టారు.

మ‌రోవైపు.. బీజేపీ నాయ‌కులు వ‌రుస పెట్టి రాహుల్‌పై కామెంట్లు చేస్తున్నారు. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు సైతం విమర్శలు గుప్పించారు. రాహుల్  వల్ల దేశం పరువుపోతోందని ట్వీట్‌ చేశారు. ఆయనతో కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే కాదు.. దేశం మొత్తానికీ ఇబ్బంది అని వ్యాఖ్యానించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News