సోముకు డౌట్ ఎక్కడో కొడుతుందట.. ?

Update: 2021-12-15 10:31 GMT
బీజేపీ ఏపీ సారధి సోము వీర్రాజు రాజకీయం ఎన్నాళ్ళో చెప్పేశారు. 2024 నాటికి తాను రిటైర్ అవుతాను అంటూ ఈ మధ్యనే సంచలన ప్రకటన ఇచ్చి ఏపీ రాజకీయాల్లో కొంత కాక పుట్టించారు. రాజకీయం సరే అధ్యక్ష పదవి ఎన్నాళ్ళు ఉంటుంది అన్నదే ఇపుడు అందరికీ పట్టుకున్న అతి పెద్ద డౌట్.

ఆ మధ్య తిరుపతి వచ్చిన బీజేపీ పెద్ద, కేంద్ర మంత్రి అమిత్ షా అయితే ఏపీలో బీజేపీ స్థితిని, సోము వీర్రాజు పెర్ఫార్మెన్స్ ని పూర్తిగా అంచనా కట్టేసి మరీ వెళ్లారు. ఆయన అలా వెళ్లగానే ఏపీలో కోర్ కమిటీ ఏర్పాటు అయింది. అందులో గతంలో సోముతో సొంత పార్టీలో విభేదించే వారే కీలకంగా ఉన్నారు. మొత్తానికి సోముకు ఆ విధంగా అధికార కత్తెర వేసిన హై కమాండ్ ఇపుడు అలంకారప్రాయమైన ఆ పదవిని కూడా లేకుండా చేస్తుంది అన్న టాక్ అయితే గుప్పుమంటోంది.

సోము వీర్రాజు అధికార వైసీపీ మేలుకే పనిచేస్తున్నారు తప్ప పార్టీకి ఎక్కడా ఎదగనీయడంలేదు అన్న ఫిర్యాదు హై కమాండ్ వద్దకు బలంగా వెళ్లిపోయింది. ఇక ఆయన టీడీపీని పూర్తిగా వ్యతిరేకించడమే కాదు, ఆ పార్టీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన ఎంపీలను కూడా చేరదీయకుండా కోవర్టులుగా అనుమానిస్తున్నారు అన్నది కూడా మరో ఆరోపణ.

తనకు నచ్చని వారిని పక్కన పెట్టేసి తాను అనుకున్నట్లుగా ఆయన పార్టీని నడుపుతున్నారన్నది కూడా ఎవరో పుణ్యం చేసుకుని మరీ హై కమాండ్ కి పూసగుచ్చినట్లుగా చెప్పేశారుట. ఇక అమరావతి రాజధాని గురించి మాట్లాడిన నేతలను సస్పెండ్ చేసి బీజేపీ స్టాండ్ ఇదేనని తప్పుడు సంకేతాలు కూడా సోము పంపించారు అన్న ఆరోపణలు ఉన్నాయట.

మొత్తానికి సోము బీజేపీ ప్రెసిడెంట్ గా ఉండగా ఎత్తిగిల్లడం కష్టమని హై కమాండ్ కి బాగా అర్ధమైపోయింది అంటున్నారు. అందుకే ఆయన్ని తప్పిస్తారు అని జోరుగా ఊహాగానాలు అయితే సాగుతున్నాయి.

అయితే తనకు 2024 వరకూ కొనసాగిస్తే తాను ఆ తరువాత రిటైర్ అయిపోతాను అన్నట్లుగా సంకేతాలు ఇస్తూ సోము ఈ మధ్య సడెన్ గా వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారని సొంత పార్టీలో గుసగుసలు పోతున్నారు. అయితే ఢక్కామెక్కీలు తిన్న హై కామాండ్ కి ఇవన్నీ పెద్దగా పట్టింపు కావు అంటున్నారు.

మొత్తానికి ఏతా వాతా తేలేది ఏంటి అంటే సోము పదవికి ఎసరు వస్తోందిట. ఆయన్ని తప్పిస్తారు అన్నది నిజమే అయితే ఎపుడు అన్నదే తెలియదు అన్న మాట వినిపిస్తోంది. మరి సోము వారసుడు ఎవరు అన్నది కూడా అతి ముఖ్యమైన చర్చగా ఉంది. సోముని తప్పిస్తే బీజేపీకి వచ్చే కొత్త ప్రెసిడెంట్ ని బట్టే ఏపీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారుతాయి అని అంటున్నారు.

ఏపీలో కొత్త అధ్యక్షుడు కనుక టీడీపీకి అనుకూలమైన వారు వస్తే కనుక ఇక 2024 ఎన్నికల్లో పొత్తులు కన్ ఫర్మ్ అంటున్నారు. మొత్తానికి సోముని తప్పించడం అంటేనే బీజేపీ ఏపీలో వేయబోయే అడుగులు రాజకీయ వ్యూహాలు కూడా తెలియచెబుతున్నాయని అన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి సోము ని తప్పిస్తే ఏపీలో బీజేపీ సంగతేంటో కానీ ఇతర పార్టీల రాజ‌కీయ లెక్కల్లో భారీ తేడాలు వస్తాయని చెప్పేయాల్సి ఉంటుంది.



Tags:    

Similar News