అగ్నివీర్‌ల‌ను బీజేపీ ఆఫీసుల‌కు కాప‌లా పెడ‌తాం: బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్య‌లు

Update: 2022-06-20 00:30 GMT
అగ్నిప‌థ్ ప‌థ‌కంపై ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా నిప్పులు చెరుగుతున్న యువ‌త మ‌రింత ర‌గిలిపోయేలా .. వ్యాఖ్యానించారు బీజేపీ నాయ‌కుడు.. నాలుగేళ్ల స‌ర్వీసు త‌ర్వాత‌.. అగ్నివీర్లను బీజేపీ కార్యాల‌యాల వ‌ద్ద బంట్రోతులుగా వాడ‌తామ‌ని వ్యాఖ్యానించా రు. ఈ మేర‌కు బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అగ్నివీర్లను దేశ‌వ్యాప్తంగా బీజేపీ కార్యాలయం వెలుపల సెక్యూరిటీ గార్డుగా నియమిస్తామనడం దేశంలో మ‌రో కొత్త వివాదానికి దారితీయ‌గా, కేంద్రానికి మ‌రిన్ని త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టిన‌ట్టు అయింది.

మ‌ధ్య ప్ర‌దేశ్‌కు చెందిన బీజేపీ నాయకుడు కైలాశ్‌ విజయవర్గీయ.. సైనికులను అవమానించారని కాంగ్రెస్ విమర్శించింది. బీజేపీ  కార్యాలయాల్లో భద్రతా సిబ్బందిగా అగ్నివీర్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తామని కైలాశ్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడింది. ఆదివారం అగ్నిపథ్ పథకాన్ని సమర్థిస్తూ భోపాల్ బీజేపీ కార్యాలయంలో విజయవర్గీయ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సైతం ఖండించారు.

``సైనికులను బీజేపీ ప్రధాన కార్యదర్శి అవమానించారు. అగ్నివీర్ సైనికులు బీజేపీ కార్యాలయం వెలుపల భద్రతా సిబ్బంది అవుతారని అంటున్నారు. ఇది సిగ్గులేని ప్రభుత్వం. అందుకే అగ్నిపథ్ పథకాన్ని వద్దని అంటున్నాం మోడీజీ' అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

ఎదురు దాడి

టూల్కిట్ గ్యాంగ్ తన వ్యాఖ్యలను వక్రీకరించిందని కాంగ్రెస్ను ఉద్దేశించి కైలాశ్ విజయవర్గీయ ఎదురు దాడి చేశారు. సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ పథకాన్ని ఉపసంహరించుకోవాలని యువత, విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమ  య్యాయి.
Tags:    

Similar News