బీజేపీకి తీపిక‌బురు: ఇంకో సీట్ పెరిగింది

Update: 2018-03-04 14:23 GMT
బీజేపీ అభిమానుల‌కు ఇంకో తీపిక‌బురు. నాగాలాండ్‌ లో బీజేపీ - నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్‌ డీపీపీ) కూటమి పంట పండింది. రాష్ట్రంలో వాళ్లు గెలిచిన స్థానాల సంఖ్య ఒకటి పెరిగింది. కౌంటింగ్‌ లో జరిగిన చిన్న తప్పిదం కారణంగా టెన్నింగ్ నియోజకవర్గంలో ఎన్‌ డీపీపీకి చెందిన నమ్రి ఎన్‌ చంగ్ బదులు.. నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌ పీఎఫ్)కు చెందిన ఎన్‌ ఆర్ జెలియాంగ్‌ ను విజేతగా ప్రకటించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ తప్పిదాన్ని సరిదిద్ది.. ఇప్పుడు ఎన్‌డీపీపీకి చెందిన నమ్రిని విజేతగా ప్రకటించింది ఈసీ. దీంతో ప్రస్తుతం కూటమి బలం 32కు చేరింది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 31 స్థానాల కంటే ఒకటి ఎక్కువే ఉంది.

రిటర్నింగ్ ఆఫీసర్ తప్పిదం కారణంగా ఈ పొరపాటు దొర్లిందని ఈసీ కార్యదర్శి అరవింద్ కుమార్ చెప్పారు. టెన్నింగ్ స్థానంలో గెలుపుతో ప్రభుత్వ ఏర్పాటుకు పీపుల్స్ డెమొక్రటిక్ అలయెన్స్ (పీడీఏ)కు లైన్ క్లియరైంది. ఇప్పటికే ఈ కూటమికి ఓ స్వతంత్ర అభ్యర్థి, జేడీయూ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. టెన్నింగ్‌ లో మొదట 7018 ఓట్లు వచ్చిన నమ్రిని కాదని 6850 ఓట్లు వచ్చిన జెలియాంగ్‌ ను విజేతగా ప్రకటించారు. రాజ్యాంగంలోని 324వ ఆర్టికల్ ప్రకారం డిక్లరేషన్‌ ను రద్దు చేసే హక్కును చెబుతూ ఈసీ విజేత పేరును మార్చింది. నాలుగోరౌండ్ లెక్కింపులో జెలియాంగ్‌ కు 624 ఓట్లు రాగా.. రిటర్నింగ్ ఆఫీసర్ పొరపాటున 824గా నమోదు చేశారు. దీంతో ఇంత పెద్ద తప్పిదం జరిగింది. ఆల‌స్యంగా అయినా బీజేపీకి తీపిక‌బురు అందింది.
Tags:    

Similar News