కాషాయ పార్టీలో ముస్లింలకు టికెట్ల పంట

Update: 2015-11-18 04:13 GMT
బీహార్ శాసనసభ ఎన్నికల్లో లౌకిక శక్తుల విజృంభణతో తుడిచిపెట్టుకు పోయిన బీజేపీకి ఆలస్యంగానైనా జ్ఞానోదయమైనట్లుంది. బీహార్ దెబ్బ నుంచి కోలుకోవడానికి గుజరాత్ పురపాలక సంస్థల ఎన్నికలు బీజేపీకి మంచి అవకాశాన్ని ఇస్తున్నాయి. బీహార్ ఎన్నికల్లో ముస్లింలు గంపగుత్తగా మహాకూటమికి ఓట్లేసినందునే తమ కొంప మునిగిందని భావిస్తున్న బీజేపీ నాయకత్వం గుజరాత్‌ లో మాత్రం ఆ తప్పు జరగకుండా జాగ్రత్తపడుతున్నట్లుంది. పురపాలక సంస్తల్లోని 8,434 స్థానాల్లో 500 పైగా స్థానాలను ముస్లింలకే అప్పగించిన బీజేపీ విజయంపై గంపెడాశలు పెట్టుకుని ఉంది. 2010లోకూడా పురపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో 300 స్థానాలును బీజేపీ ముస్లింలకు కేటాయించగా, 250 మంది అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. మోదీ సద్భావనా యాత్రలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం బీహార్ ఎన్నికల ఫలితాలతో తల బొప్పి కట్టిన బీజీపీ నాయకత్వం గత అనుభవాలను, విజయాలను దృష్టిలో పెట్టుకుని 40 శాతం అధికంగానే ముస్లింలకు టికెట్లు అందించింది. ఇది తమకు విజయానికి హామీ ఇవ్వడమే కాకుండా ముస్లింలకు, పార్టీకి మధ్య అంతరాన్ని తొలగిస్తుందని నాయకత్వం ఆశిస్తోంది. ఢిల్లీ, బీహార్‌ లలో ఊచకోతకు గురయ్యాక సొంత రాష్ట్రంలో కూడా పరాజయాలను తాము తలకెత్తుకోవాలని భావించటం లేదని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు ఆర్సీ ఫాల్డు వ్యాఖ్యానించారు.

 మైనారిటీ నేతలు కూడా బీజేపీ నిర్ణయాన్ని సానుకూలంగానే స్వీకరించారు. అయిదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ముస్లింలకు ఒరిగిందేమీ లేదని, కానీ గత అయిదేళ్లకాలంలో తమతమ ప్రాంతాల్లో బీజేపీ పాలన పలితంగా జరిగిన అభివృద్ధి కారణంగానే మైనారిటీలు బీజేపీని విశ్వసిస్తున్నారని బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మెహబూబ్ ఆలి చిస్తీ పేర్కొన్నారు. పార్టీ నిలిపిన 500 స్థానాల్లో కనీసం 350 నుంచి 400 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులు జయకేతనం ఎగురవేస్తారని ఆయన ధీమా వ్యక్తి చేశారు.

ఇటీవలి ఎన్నికల్లో పరాజయ భారం నుంచి ఉపశమనం పొందటం, ముస్లింల పునాదిని మెరుగుపర్చుకోవడం అనే రెండు లక్ష్యాలను ఏకకాలంలో సాధించడానికి బీజేపీ ఎత్తు వేస్తున్నట్లు కనబడుతోంది. బీహార్ ఎన్నికల అనంతరం ఇంత త్వరగా బీజేపీ గుణపాఠం నేర్చుకోవడం ముదావహమే.
Tags:    

Similar News