గెల‌వ‌క‌పోయినా ప‌ర్లే...ప‌రువు కాపాడుకోవాలి

Update: 2015-12-25 10:11 GMT
మనం బ‌ల‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. 2019 ఎన్నిక‌ల్లో ఉత్త‌రాది కంటే ద‌క్షిణాదిపైనే మా భ‌రోసా ఎక్కువ ఉంది. ఆ సార్వ‌త్రిక ఎన్నిక‌లో తెలంగాణ‌లో అధికారంలోకి రావాలి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో బ‌ల‌మైన శ‌క్తిగా ఎద‌గాలి- ఇది ప్ర‌తి స‌మావేశంలోనూ బీజేపీ అగ్ర‌నేత‌లు ఆ పార్టీ రాష్ర్ట నాయ‌కులకు చేసే హిత‌బోధ‌. కానీ భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ‌ రాష్ర్ట శాఖ మాత్రం త‌న ఎదుగుదల‌ను ఏమాత్రం చూప‌లేక‌పోతోంది. స‌రిక‌దా ఉన్న నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేయ‌లేని దీన స్థితిలో ఉంద‌ని పార్టీ నాయ‌కులే వాపోతున్నారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం అధికార టీఆర్ ఎస్‌ - ప్ర‌తిప‌క్ష‌ కాంగ్రెస్ పార్టీలు క్యాంపు రాజాకీయాలు చేస్తుంటే...తెలంగాణాలో ప్రత్యామ్నాయం అని చెప్పుకొనే  బీజేపీ మాత్రం ఉలుకు ప‌లుకు లేకుండా.. ఎక్కడవేసిన గొంగ‌లి అక్కడే ఉన్న చందంగా త‌యారయ్యింది.కొన్ని జిల్లాల్లో ఓట్లు ఉన్నా వాటిని ఉప‌యోగించుకోవాలన్న ధ్యాస‌ నాయ‌కుల్లో క‌నిపించ‌డంలేదంటే ఆ పార్టీ ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. పార్టీవ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో98 ఓట్లు - రంగారెడ్డిజిల్లాల్లో63 ఓట్లు ఉన్నాయి. న‌ల్గొండ‌లో క‌మ‌లానికి 25 ఓట్లు, క‌రీంన‌గ‌ర్‌ లో 35 ఓట్లు ఉన్నాయి. అయితే వాటిని కాపాడుకునే ప్రయ‌త్నం చేయ‌డం లేదు స‌రిక‌దా క‌నీసం ప‌లానా వారికి ఓటు వేయండ‌నే సూచ‌న కూడా అగ్ర‌ నాయ‌కులు చేయ‌డం లేదు!!

దాదాపు నాలుగు జిల్లాల్లో విజ‌యాన్ని నిర్దేశించే స్థాయిలో బీజేపీకి ఓట్లున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో న‌ల్ల‌గొండ‌ - రంగారెడ్డి - మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లాలో బీజేపీ ఓట్లు కీల‌కంగా మార‌నున్నాయి. ఈ మూడు జిల్లాల్లో రెండు చోట్ల మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీతో క‌లిసి ఒక‌టి రెండు స్థానాల‌యినా గెల‌వాల‌నే ల‌క్ష్యంతో మిత్రప‌క్షంతో క‌ల‌సి ఉన్న ఓట్లను ఉప‌యోగించుకొనే  ప్రయ‌త్నం పార్టీ నాయ‌క‌త్వం నుంచి ఏమాత్రం జ‌ర‌గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ నేత‌లు అవ‌స‌ర‌మైతే భాజాపా-టీడీపీ మ‌ద్దతు తీసుకుంటామ‌ని బాహాటంగా ప్రక‌ట‌న చేస్తున్నా పార్టీ నాయ‌క‌త్వం నోరు విప్పక‌పోవ‌డంపై క‌మ‌ళ‌నాథుల నుంచి విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. త‌మ ఓట్ల‌తో అభ్య‌ర్థులు గెలవ‌డం, గెల‌వ‌క‌పోవ‌డం అనే విష‌యం ప‌క్క‌న‌పెడితే భాజాపా త‌ర‌ఫున‌ ఓట్లు ఎవ‌రికి వేయాలో అర్థంకాక సందిగ్దంలో ఉండే ప‌రిస్థితి ఏమిటని విస్మ‌యం  వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడే ప‌రిస్థితి ఇలా ఉంటే అదికారంలోకి రావాల‌నుకున్న పార్టీ అని చెప్పుకొంటున్న పార్టీ నాయ‌కులుగా భ‌విష్యత్తులో ఏమ‌ని చెప్పుకోగ‌ల‌మ‌ని పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తలు ఆందోళన చెందుతున్నారు. నామ‌మాత్ర‌మైన పోరులోనే ఎవ‌రికి మ‌ద్దతు ఇవ్వాలనే అంశంపై పార్టీనాయ‌క‌త్వం క్లారిటీ ఇవ్వ‌క‌పోతే పార్టీకి ఒక విధానం అంటూ ఉండి ఏం లాభ‌మ‌ని బీజేపీ శ్రేణులు ఆ పార్టీ అగ్ర‌నేత‌ల‌ను ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    

Similar News