గోద్రాలో బీజేపీకి దిమ్మ తిరిగే షాక్.. మజ్లిస్ కూటమి జెండా ఎగిరింది

Update: 2021-03-19 04:37 GMT
ఏముంది పిల్ల కాకి అంటూ లైట్ తీసుకోవటం.. ఆ తర్వాత మొత్తంగా మునిగిపోవటం రాజకీయాల్లో తరచూ చూస్తునే ఉంటాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీల ప్రారంభం దీనికో ఉదాహరణగా చెప్పొచ్చు. బీజేపీ రహస్య స్నేహితుడిగా.. మోడీషా ప్లానింగ్ లో భాగంగా కమలనాథులకు కలిసి వచ్చేలా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యవహరిస్తారంటూ తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ.. మజ్లిస్ అధినేత ఏ రోజు కూడా ఈ ఆరోపణలపై సూటిగా స్పందించింది లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా బీజేపీకి దిమ్మ తిరిగే షాకిచ్చింది. ఇటీవల కాలంలో ఇంత భారీ షాక్ ఆ పార్టీకి మరే రాజకీయ ప్రత్యర్థి నుంచి ఎదురుకాలేదని చెప్పాలి. బీజేపీ అన్నంతనే గుర్తుకు వచ్చే గుజరాత్ లో.. ఆ పార్టీ చేతిలో ఉన్న అధికారాన్ని తమ కూటమికి బదలాయించుకునే మేజిక్ ను ప్రదర్శించారు అసదుద్దీన్ ఓవైసీ. గోద్రా మున్సిపాలిటీ మీద మజ్లిస్ కూటమి జెండా ఎగరటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

2002 ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా రైల్వేస్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలు ఎస్ 6 బోగీకి దుండగలు నిప్పు పెట్టటంతో.. 59 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో అత్యధికులు అయోధ్య పర్యటనకు వెళ్లి వస్తున్న వారే. ఈ వ్యవహారం మత కల్లోలాలకు దారి తీసి గుజరాత్ ను అట్టుడికిపోయేలా చేసింది. ఈ ఉదంతం అనంతరం గుజరాత్ లో బీజేపీ మరింతగా బలపడిన విషయం తెలిసిందే.

అలా రాజకీయంగా బీజేపీకి పెట్టని కోటలా ఉండే గుజారాత్ లో తొలిసారి.. మజ్లిస్ లాంటి పార్టీ ఏర్పాటు చేసిన కూటమి కమలనాథులకు దిమ్మ తిరిగే షాకిచ్చింది. బీజేపీకి పెట్టని కోటలా ఉండే ఈ ప్రాంతంలో దశాబ్దాల తర్వాత తొలిసారి బీజేపీయేతర పార్టీ మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవటం సంచలనంగా చెప్పాలి. 44 స్థానాలున్న గోద్రా మున్సిపాలిటీలో మజ్లిస్ బలం అక్షరాలు ఏడు మాత్రమే. కాకుంటే.. ఆ పార్టీ జత కట్టిన కూటమి పుణ్యమా అని ఇప్పుడు అధికారపక్షంగా అవతరించింది. ఈ కూటమికి చెందిన 17 మంది గెలవటం.. బీజేపీ టికెట్ దొరక్క రెబెల్స్ గా పోటీ చేసిన వారు కొందరు గెలిచిన తర్వాత మజ్లిస్ కూటమిలో చేరటంతో.. అధికారం మజ్లిస్ కూటమి వశమైంది.

బీజేపీ అభ్యర్థులు 18 స్థానాల్లో మాత్రమే గెలవటం.. వైరి వర్గానికి చెందిన వారంతా ఒకే కూటమిగా నిలవటంతో గోద్రాలో బీజేపీయేతర జెండా తొలిసారి ఎగిరినట్లుగా చెబుతున్నారు. ఫిబ్రవరి 28న ఎన్నికలు జరిగితే.. తాజాగా మజ్లిస్ కూటమికి చెందిన సంజయ్ సోనీ మున్సిపల్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News