కాషాయంలో గ్రూపులు.. కొత్త లొల్లి

Update: 2019-07-27 01:30 GMT
బీజేపీ అంటే నీట్ పాలిటిక్స్.. క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తలు ఉంటారని అంతా అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ గ్రూపు పాలిటిక్స్ గోల కాషాయాన్ని కమ్మేసింది. తాజాగా ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతల మధ్య ఆదిపత్య పోరు బీజేపీలో పతాకస్థాయికి చేరింది.

ఒకరేమో ఎంపీ.. మరొకరు ఏమో ఏకంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈ ఇద్దరి ఆదిపత్య పోరు ఇప్పుడు కరీంనగర్ పాలిటిక్స్ లో హీట్ పెంచేసింది. తాజాగా బీజేపీ సభ్యత్వ నమోదు చిచ్చు పెట్టింది.

కరీంనగర్ యువ బీజేపీ ఎంపీ బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీ ధర్ రావు మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. బండి సంజయ్ కు టికెట్ రాకుండా గతంలో మురళీధర్ రావు నానా ప్రయత్నాలు చేశారన్న టాక్ జిల్లా నేతల్లో ఉంది. కానీ సొంత ఇమేజ్ తో బలమైన నాయకుడిగా ఉన్న బండి సంజయ్ కు మరో జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పట్టుబట్టి మరీ ఎంపీ టికెట్ ఇప్పించాడు. దీంతో బండి  సంజయ్ కరీంనగర్ ఎంపీగా సంచలన విజయాన్ని సాధించాడు.

అయితే గెలిచిన బండి సంజయ్ తాజాగా సభ్యత్వ నమోదులో మురళీ ధర్ రావు ఫొటోను ఫ్లెక్సీపై పెట్టకపోవడంపై ఆయన అనుచరులు నాయకులు అభ్యంతరం తెలిపారు. చివరకు లొల్లి బాగా కావడంతో ఫొటో పెట్టాల్సి వచ్చింది. బండి జిల్లా రాజకీయాల్లో మొత్తం తన కేడర్ ను, అనుయాయులనే పెట్టుకొని పార్టీ నడిపించడం ఇప్పుడు మురళీధర్ రావు వర్గానికి ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి, తన పార్టీ ఎంపీతోటే ఫైట్ చేస్తుండడం జిల్లా రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది.  

    

Tags:    

Similar News