హ‌రియాణాలో బీజేపీ వెనుకంజ‌.. రీజ‌న్ ఇదే..!

Update: 2019-10-24 07:17 GMT
తాజాగా వెల్ల‌డైన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హారాష్ట్రలో బీజేపీ దూకుడు ప్ర‌ద‌ర్శించి రెండో సారి కూడా అధికారం చేజిక్కించుకునే దిశ‌గా ప‌రుగులు పెడుతుంటే.. మ‌రో రాష్ట్రం, అధికారంలో ఉన్న స్టేట్‌లో మాత్రం బీజేపీ వెనుక‌బ‌డి పోయింది. వాస్త‌వానికి అతి పెద్ద రాష్ట్రం మ‌హారాష్ట్ర‌లో బీజేపీ రెండో సారి గెల‌వ‌డం చ‌రిత్ర సృష్టించినా.. చిన్న రాష్ట్రం తక్కువ సీట్లున్న హ‌రియాణాలో మాత్రం వెనుక‌బ‌డి పోవడం దీనిక‌న్నాఎక్క‌వ చ‌ర్చ‌నే ర‌గిలించింది. ప్ర‌స్తుతం గురువారం ప్రారంభ‌మైన ఎన్నిక‌ల కౌంటింగ్‌లో బీజేపీ ముందంజ‌లోనే ఉన్న‌ప్ప‌టికీ.. మేజిక్ ఫిగ‌ర్‌కు మాత్రం క‌డుదూరంలో ఉండ‌డం గ‌మ‌నార్హం.

మొత్తం 90 సీట్లున్న హ‌రియాణా అసెంబ్లీలో ప్ర‌స్తుతం వెల్ల‌డైన ఫ‌లితాల ప్ర‌కారం.. బీజేపీ 39 స్థానాల్లో ముందంజ‌లో ఉండ‌గా.. కాంగ్రెస్ 31 స్థానాల్లో దూసుకుపోతోంది. అదేస‌మ‌యంలో జేజేపీ(స్థానిక పార్టీ) స‌హా ఇత‌ర ప‌క్షాలు 20 స్థానాల్లో ముందంజ‌లో ఉన్నాయి. దీనిని బ‌ట్టి చూస్తే.. మేజిక్ ఫిగ‌ర్ 46 చేరేందుకు బీజేపీ ఎక్క‌డా అవ‌కాశం ల‌భించ‌డం లేదు. మ‌రి ఇలాంటి ప‌రిస్తితి ఎందుకు వ‌చ్చింది. ఢిల్లీకి అత్యంత స‌మీపంలో ఉన్న ఈ రాష్ట్రంలో మోడీ ప్ర‌భావం కానీ, బీజేపీ సార‌థి అమిత్ షా వ్యూహం కానీ ఫ‌లించ‌లేదా?  లేక స్థానిక స‌మ‌స్య‌లు పార్టీని చుట్టుముట్టాయా? అనే చ‌ర్చ సాగుతోంది.

ఒక్క‌సారి ఈ రాష్ట్రం ప‌రిస్థితి చూస్తే.. ఇక్క‌డ బీజేపీ అధికారంలో ఉంది. మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్ సీఎంగా ఉన్నారు. ఆర్ ఎస్ ఎస్ వాదిగా, హిందూవాదిగా పేరున్న ఖ‌ట్ట‌ర్ సార‌ధ్యంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం సాగింది. అయితే, ఖట్టర్ ప్రభుత్వ పాలనలో సంతృప్తికరంగా లేరనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీ పాలనలో పెరిగిన నిరుద్యోగం, మహిళలపై జరుగుతున్న దాడులు, పెరుగుతున్న ధరలను వ్యతిరేకిస్తూ హరియాణా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ‌రోప‌క్క‌, పోలీసుల వ్య‌వ‌హారం కూడా ఇటీవ‌ల కాలంలో తీవ్రంగా విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

అస‌లు ఎన్నిక‌ల‌కు ముందు మ‌రోసారి 75 సీట్లు సాధించి... క‌ట్ట‌ర్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌ని చెప్పింది. ఇక ఫ‌లితాలు చూస్తుంటే పాల‌న‌పై బీజేపీ మార్కు చూపించ‌లేక పోవ‌డం స‌హా ప్ర‌జ‌ల్లో పెల్లుబికిన ఆగ్ర‌హం పార్టీని ప‌త‌నానికి చేరుస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక మ‌రోవైపు జేజేపీకి 10 సీట్లు వ‌చ్చే ఛాన్సులు ఉండ‌డంతో ఎవ‌రు త‌న‌ను ముఖ్య‌మంత్రిని చేస్తే వారికే స‌పోర్ట్ చేస్తాన‌ని ఆ పార్టీ నేత దుష్యంత్ చౌత‌లా డిమాండ్ పెడుతున్న‌ట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News