మోడీగారు..మీదో ప‌కోడి పార్టీ

Update: 2018-05-06 04:55 GMT
పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క ఎన్నిక‌లు హాట్ హాట్‌ గా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచినా ఓడినా.. ఈ అసెంబ్లీ ఎన్నికలను మాత్రం సీఎం సిద్దరామయ్య తనదైన ముద్ర వేసుకున్నారు. మొత్తం రాష్ర్టానికి మస్కట్‌ గా గుర్తింపు పొందడం దగ్గర్నించి.. ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీకి ట్విట్టర్‌ లో సవాళ్లు విసరడం వరకు..కన్నడ ఎన్నికల సమరం తనకు ఇతరులకు అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకొచ్చారు. ఆయన ఎన్నికల ఎజెండాను సెట్ చేస్తూ ఇతరులు దానికి స్పందించేలా వ్యూహాలు రచిస్తున్నారు. మంచివక్తగా పేరొందిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి దీటుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యవహరిస్తున్నారు. మోడీ వ్యాఖ్యలకు గుక్కతిప్పుకోకుండా వెంట వెంటనే గట్టి సమాధానాలు ఇస్తున్నారని చెప్తున్నారు.

ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్ - పుదుచ్చేరి - పరివార్-పీపీపీ పార్టీ అంటూ కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టిన సిద్దరామయ్య.. బీజేపీని ప్రిజన్ - ప్రైస్‌ రైజ్ - పకోడీ (జైలు - ధరల పెంపు - పకోడీ) పార్టీ (పీపీపీ)గా అని ట్విట్టర్‌ లో అభివర్ణించారు. ``ప్రియమైన మోడీజీ - పీపీపీ అనే అక్షరాలకు మీరు కొత్త భాష్యం చెప్పారని విన్నాను. సర్.. ప్రజల యొక్క.. ప్రజల ద్వారా.. ప్రజల కోసం అనే ప్రజాస్వామ్యానికి చెందిన మూడు పీల్లో మేం చాంపియన్లం. మీ పార్టీ (బీజేపీ) ప్రిజన్-ప్రైస్‌ రైస్-పకోడా పార్టీగా మారింది` అని ఎద్దేవా చేశారు.

ఇదిలాఉండ‌గా...బీజేపీ ఆలోచనలకు, వ్యూహాలకు సిద్దరామయ్య ఎక్కడా చిక్కడం లేదు. దీంతో ప్రతిపక్షం ఆయన లోపాలను ఎత్తిచూపలేకపోతోంద‌ని అంటున్నారు. వ్యక్తిగతంగా సిద్దరామయ్యపై అవినీతి ఆరోపణలు చేయడం బీజేపీకి సాధ్యం కావడం లేదు. అదేసమయంలో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప నిజాయితీపరుడు అని ప్రకటించుకోలేని పరిస్థితితో సంక‌టంలో ప‌డింద‌ని చెప్తున్నారు. మ‌రోవైపు ప్రత్యేక జెండా.. హిందీ వ్యతిరేక ఉద్యమం.. కర్ణాటకలో కన్నడ భాషకే అగ్రస్థానం కల్పించడం వంటి అంశాలతో సీఎం సిద్దరామయ్య హిందూత్వ పోలరైజేషన్‌ ను (కేంద్రీకరణ వ్యూహాన్ని) విజయవంతంగా దెబ్బతీయగలిగారు. కొన్ని జిల్లాల్లో మినహా యూపీ తరహా హిందూత్వ పోలరైజేషన్ కర్ణాటకలో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదని బీజేపీ భావిస్తోంది. బీజేపీకి గట్టి ఝలక్ ఇవ్వాలనే ఉద్దేశంతో చివరి నిమిషంలో సీఎం సిద్దరామయ్య లింగాయత్‌లకు మతపరమైన మైనార్టీ హోదా ఇస్తూ తీసుకున్న నిర్ణయం అంతగా ప్రభావం చూపడం లేదనే టాక్ కూడా ఉంది. పైగా చాలామంది లింగాయత్‌లు తమకు వీరశైవులకు మధ్య కృత్రిమ విభజన రేఖను సృష్టించారని భావిస్తుండ‌టం ఆయ‌న మైన‌స్ అంటున్నారు.
Tags:    

Similar News