పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి మొదలుకొని ప్రధాని వరకు.....రాజకీయ నాయకులంతా తమ హోదాను దర్పాన్ని ప్రదర్శించకుండా ఉండలేరు. గల్లీలోని ఛోటామోటా నాయకుడు కూడా అనుచరగణం లేనిదే పర్యటనలకు వెళ్లరు. రాజకీయ పర్యటనల సందర్భంగా తమ నేతలు కనుసైగ చేస్తే చాలు ఏ పనైనా చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు. అటువంటిది ఓ ఎంపీ స్థాయి వ్యక్తి తన ప్రవర్తనతో అందరినీ విస్మయానికి గురిచేశారు. పక్కన అనుచర గణం - అధికారులు ఉన్నా....హుకుం జారీ చేస్తే ఆ పనిని నిమిషాల్లో చక్కబెట్టే యంత్రాంగం ఉన్నా....ఆయన వారిని ఉపయోగించలేదు. స్వయంగా తానే ఆ పని చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. తన హోదాను మరిచి సింప్లిసిటీని ప్రదర్శించిన ఆ ఎంపీపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
మధ్యప్రదేశ్ లోని రివా నియోజకవర్గం ఎంపీ - బీజేపీ నేత జనార్ధన్ మిశ్రా...ఓ పాఠశాలను సందర్శించారు. తమ పాఠశాలలో మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో తాము కాలకృత్యాల కోసం బయటకు వెళ్తున్నామని అక్కడి విద్యార్థులు తెలిపారు. దీంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జనార్ధన్ ఆ మరుగుదొడ్డిని శుభ్రం చేయడానికి పూనుకున్నారు. ఆయన ఆదేశిస్తే వెంటనే శుభ్రం చేసే ఏర్పాట్లు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆయనే స్వయంగా తన చేతులతో ఆ మరుగుదొడ్డిని శుభ్రపరిచారు. చీపురు చేతబట్టి మరుగుదొడ్డిలో ఇరుక్కున్న మట్టిని తన చేతులతో వెలికి తీశారు. స్వచ్ఛభారత్ ఉద్యమంలో భాగంగా తాను ఈ విధంగా చేశానని, తన ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోను జనార్దన్ పోస్ట్ చేశారు. ఏ మాత్రం అహంభావం లేకుండా మరుగుదొడ్డిన శుభ్రం చేసిన ఎంపీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.