ఆసుపత్రి నుంచి చింతల ఫ్యామిలీ డిశ్చార్జ్.. బిల్లు ఎంతంటే?

Update: 2020-06-10 05:45 GMT
మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ రాష్ట్రంలో ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయి నేతకు.. వారి కుటుంబంలోని కొందరికి పాజిటివ్ వచ్చిన రావటం తెలిసిందే. అలా వచ్చిన రాజకీయ కుటుంబంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ను చెప్పాలి. అందరికి సుపరిచితుడైన నేతకు పాజిటివ్ రావటం.. ఆసుపత్రిలో చేరటంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

అపోలో ఆసుపత్రిలో చింతల ఫ్యామిలీ చికిత్స పొందింది. టెస్టుల్లో పాజిటివ్ వచ్చినా.. దాని ప్రభావం పెద్దగా లేకపోవటంతో తక్కువ వ్యవధిలోనే వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మంగళవారం సాయంత్రం వారు ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. రోగ లక్షణాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో వారిని ఇంటికి పంపేయాలని వైద్యులు నిర్ణయించారు. కాకుంటే.. ఇంట్లోనే మరిన్ని రోజులు హోం క్వారంటైన్ ఉండాల్సిన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న చింతలకు ఆసుపత్రి బిల్లు ఎంత వచ్చిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పలు మార్గాల్లో ఆరా తీయగా.. మాజీ ఎమ్మెల్యే కావటంతో.. ఇప్పటికిప్పుడు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని.. వారికుండే ప్రొవిజన్స్ కారణంగా.. ప్రభుత్వమే చెల్లిస్తుందని చెబుతున్నారు. అయితే.. ఆ మొత్తం ఎంతన్నది బయటకు రాలేదు.

ఇదిలా ఉంటే.. పాజిటివ్ వచ్చిన పలువురు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. కొందరి విషయంలో బిల్లు భారీగా వస్తుంటే.. మరికొందరి విషయంలో మాత్రం బిల్లు ఒక మోస్తరుగా ఉన్నట్లు తెలుస్తోంది. బీమా సౌకర్యం కూడా ఈ మాయదారి రోగానికి ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తున్నా.. చికిత్సలో భాగంగా కొన్ని ఛార్జీల్ని రోగులే భరించాల్సి వస్తుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News