మోడీ ఖాతాలో కియాను కలిపిన పైడికొండ!

Update: 2018-03-12 23:30 GMT
భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ ఒక అపారమైన నమ్మకం ఉంది. రాష్ట్రంలో భాజపా సర్వనాశనం అయిపోయినా ఏమీ పర్లేదు... కేంద్రంలోని మోడీ దయ మనకుంటే చాలు.. ఇవాళ జీవీఎల్ నరసింహారావుకు యూపీ నుంచి ఎంపీ చాన్స్ ఇచ్చినట్టుగా మనకు కూడా ఏదో  ఒక చోటనుంచి అవకాశం కల్పిస్తుంటారు. కనుక.. మనం రాష్ట్ర ప్రయోజనాలకంటె.. మోడీ భజనకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.. అనేది వారి లెక్క.

ఈ విషయంలో ఏపీలోని మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాల రావు కూడా రెచ్చిపోయి భజన చేస్తున్నారు. రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఏర్పాటు అవుతున్న కియామోటార్స్ పరిశ్రమను కూడా ఆయన మోడీ ఖాతాలో వేసేస్తున్నారు. కేంద్రం ప్రభుత్వం వల్లనే కియా మోటార్స్ వచ్చిందని అంటున్న మాణిక్యాల రావు.. ఎందుకు అలా? అనే మాట మాత్రం వివరించలేకపోతున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ.. ఈ దేశంలో ఏదో ఓటు బ్యాంకు పథకాలను ప్రకటించడమే తప్ప.. క్రియాశీలంగా ఉత్పాదకత పరంగా - ఉపాధుల పరంగ పరిశ్రమలను తీసుకురావడం అంటూ జరిగితే.. కేవలం గుజరాత్ విషయంలో మాత్రమే తన ప్రేమను కనబరుస్తున్నారు తప్ప.. అసలు మిగిలిన దేశానికి కూడా తాను ప్రధానమంత్రిని అనే సంగతి ఆయనకు గుర్తుందా లేదా అనే విమర్శలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి.

పైడికొండ తమ పార్టీ ప్రధానిని పొగుడుకోవడం తప్పు లేదు గానీ.. ఆ మోజులో వాస్తవాలను కూడా మరచిపోయి.. భజన మాత్రమే పరమార్థం అనుకుంటే ఎలా అని పలువురు అంటున్నారు.

నిజం చెప్పాలంటే.. అనంత పురం జిల్లాలో భౌగోళికంగా ఉన్న అనుకూలతలను బట్టి మాత్రమే.. కియా మోటార్స్ సంస్థను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఇందులో చంద్రబాబు ప్రతిభ ఉందని అనుకోవడం కూడా భ్రమ. ఆయన రాష్ట్రముఖ్యమంత్రి గనుక.. ఆయనకు కొంత ప్రాధాన్యం వారు ఇచ్చి ఉండొచ్చు తప్ప.. అచ్చంగా ఆయన సాధించిందేమీ కాదు.

క్రెడిట్ తో ఆయనకే సంబంధం లేదని ప్రజలు భావిస్తోంటే.. పైడికొండ వచ్చి.. మోడీ ఖాతాలో రాయాలనిచూడడం ఇంకా ఘోరం అని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి ఈ సత్యాల్ని ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్ల వారు తమను నమ్మరనే సంగతిని భాజపా నేతలు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో మరి!
Tags:    

Similar News