టీడీపీ అంటే...టోట‌ల్ డ్రామా పార్టీ

Update: 2018-07-17 16:58 GMT
ఏపీలో అధికార ప‌క్షం - కొద్దికాలం కింద‌టి వ‌ర‌కు త‌మ మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ గురించి బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు విరుచుకుప‌డ్డారు. పార్ల‌మెంటు స‌మావేశాల నేప‌థ్యంలో బీజేపీపై అవిశ్వాసం పెట్టేందుకు టీడీపీ స‌న్న‌ద్ధ‌మ‌వుతుండ‌టం, ఇందుకోసం ప‌లు ప్ర‌తిప‌క్ష‌ పార్టీల‌ను సంప్ర‌దిస్తున్న నేప‌థ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జీవీఎల్ విరుచుకుప‌డ్డారు. తెలుగుదేశం కొత్త డ్రామాలు ఆడుతోందని ఎద్దేవా చేశారు. ``టీడీపీ నేత‌లు ఎదో పొడిచేస్తాం అంటున్నారు... విర్రవీగుతున్నారు. TDP అంటే టోటల్ డ్రామా పార్టీ. దొంగ దీక్షలు చేస్తున్నారు. వీరి దొంగ దీక్షలను ఎండగట్టాం. తెలుగుదేశం డ్రామాలను ప్రజలకు చూపించాం. పార్ల‌మెంటు స‌మావేశాల్లో సైతం ఇదే రీతిలో ఆ పార్టీ తీరును ఎండ‌గ‌డ‌తాం`` అని స్ప‌ష్టం చేశారు.

కేంద్రం నుంచి నిధులను తీసుకుంటూ టీడీపీ డ్రామాలు ఆడుతోందని జీవీఎల్ మండిప‌డ్డారు. `స్పెషల్‌ ప్యాకేజీని తీసుకుంటూ ... మళ్ళీ డ్రామాలు ఆడుతున్నారు. రెండేళ్ల క్రితం ప్యాకేజీ ... అద్భుతం అన్నారు. ఇప్పుడు మరో నాటకం ఆడుతున్నారు. రంగస్థలం బట్టి  డ్రామాను మారుస్తున్నారు. గుజ‌రాత్‌ లో మాజీ ఉప‌ప్ర‌దాని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్‌ పటేల్ విగ్రహం ఏర్పాటు - దోలేర సిటీ విషయంలో తప్పుడు సమాచారం ఇస్తూ డ్రామాలు ఆడారు. వాటిని మేం ఎండ‌గ‌ట్టాం. తెలుగుదేశం డ్రామాలను పార్లమెంట్ సాక్షిగా ఎత్తి చూపుతాం. తెలుగుదేశం అవిశ్వాసం పెడితే మేం చర్చకు రెడీ. `` అని జీవీఎల్ తెలిపారు. ఎన్నిక‌ల్లో ఎన్నుకున్న పాపానికి 1500 రోజులుగా ప్రజలు తెలుగుదేశం పార్టీని భరిస్తున్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు. `కేంద్రం పథకాలకు పచ్చ బ్రాండ్ వేస్తున్నారు . పోలవరం ప్రాజెక్టు వారం వారం వెళ్లి ఏమి సాధిస్తున్నారు? అస‌లు పోలవరం ప్రాజెక్టు మీరు ఏం చేశారు?``అని జీవీఎల్ సూటిగా ప్ర‌శ్నించారు.

కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ డ్రామాలే ఆడుతున్నారని జీవీఎల్ ఆరోపించారు. `కడప స్టీల్ ప్లాంట్ రాకుండా చేసింది తెలుగుదేశమే... ఇప్పుడు మళ్లీ దీక్షలు అంటున్నారు. సాగరమాల కింద రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రచారం కోసం గడ్కరీ చుట్టూ తిరిగారు. ఇప్పుడు విమ‌ర్శిస్తున్నారు. ఆంధ్రప్ర‌దేశ్‌ అభివృద్ది కోసం వెనక్కి తిరిగి చూస్తే మోడీ కనిపిస్తున్నారు. అక్కడ బాబు కనిపించడం లేదు. మళ్ళీ తెలుగుదేశం గెలవడం కల్ల`` అని జీవీఎల్ అన్నారు. ``బాబు పాపాల చిట్ట మా దగ్గర ఉంది. ప్రజల ముందు మీ బాగోతాలను బయట పెడతాం. తెలుగుదేశానికి క్రెడిబిలిటీ లేదు. రాష్ట్రంలో ప్రజలే చీ కొడుతున్నారు`` అని విరుచుకుప‌డ్డారు.
Tags:    

Similar News