భాజపా అక్కడ గోతులు తవ్వుతోందా?

Update: 2018-01-04 08:20 GMT
భారతీయ జనతా పార్టీ రకరకాల విలువల్లేని కుట్రలకు పాల్పడుతూ ఉంటుందని.. ఆ విషయంలో వారికి సిద్ధాంతాలు ఏమీ ఉండవని.. అవకాశ వాద రాజకీయాలకు పాల్పడుతూ.. చాలా ఇతర పార్టీల్లాగానే కుట్రలు కూహకాలకు పాల్పడుతుంటారని.. వారి రాజకీయ ప్రత్యర్థులు విమర్శించవచ్చు గాక..! కానీ స్వయంగా ఆ పార్టీ నాయకుడి మాటల్లోనే వారి గురించి అలాంటి అనుమానాలు కలిగేలాగా చెబితే ఎలా అర్థం చేసుకోవాలి? తాము కుట్రలు చేస్తాం.. కిట్టని వారిని.. ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి తీరుతాం.. అని అర్థం వచ్చేలాగా.. స్వయంగా భాజపా నాయకుడే సెలవిస్తే ప్రజల్లో ఖచ్చితంగా అనుమానం కలుగుతుంది. ఇప్పుడు తమిళనాట అదే పరిస్థితి ఉంది. ఆర్కే నగర్ లో ఎమ్మెల్యేగా విజయం సాధించి.. తానే జయలలితకు నిజమైన వారసుడిని అని డప్పు కొట్టి చెప్పుకుంటున్న టీటీవీ దినకరన్ కు భాజపా ఏదో ఒక వక్రమార్గంలో కీడు తలపెడుతుందేమో అనే ప్రచారం అక్కడి రాజకీయాల్లో జరుగుతోంది.

వివరాల్లోకి వెళితే..

చెన్నై ఆర్కే నగర్ లో అందరి ఆశలకు గండికొడుతూ టీటీవీ దినకరన్ గెలిచారు. ఫలితం తేలిపోయిన తర్వాత.. ఇప్పుడు ఆయన ఎలా గెలిచారనే చర్చకు విలువ లేదు. గెలిచిన దగ్గరి నుంచీ అన్నా డీఎంకే కు తానే అసలైన వారసుడినని చాటుకుంటున్న దినకరన్.. ఆ పార్టీ నుంచి తనను వెలివేసిన పరిణామానికి కీలకంగా నిలిచిన మోడీ ప్రభుత్వాన్ని ఎడాపెడా తిడుతున్నారు. దీనిపై అక్కడి కమలదళానికి సహజంగానే కోపం వచ్చింది. అయితే గియితే...దినకరన్ విమర్శలకు వారు సమాధానం చెప్పాలి కానీ.. కేంద్రలోని తమ భాజపా ప్రభుత్వం రెండు రోజుల్లోగా దినకరన్ కు భారీ షాక్ ఇవ్వబోతున్నదంటూ ఆ పార్టీ నాయకుడు ఒకరు హెచ్చరిస్తున్నారు.

భాజపా జాతీయ కార్యదర్శి హెచ్ రాజా మాట్లాడుతూ.. రెండు రోజుల్లో దినకరన్ కు షాక్ తప్పదని అంటున్నారు. అంటే..  ఈ మాటలు విన్న ఎవరికైనా తెరవెనుక ఏదో జరుగుతోందనే అనుమానం ప్రబలుతుంది. శశికళ.. పార్టీ నాయకురాలిగా ఎంపికై లేఖ పంపితే.. ఆమెను సీఎం చేయకుండా గవర్నర్ చెన్నై రాకుండా జాప్యం చేయడం మీదనే చాలా ఆరోపణలున్నాయి. ఆమె జైలుకు వెళ్లే దాకా సాగదీశారు. ఆ తర్వాత కూడా శశికళకు ప్రతికూలంగా అక్కడి రాజకీయ పరిణామాలు నడవడం వెనుక భాజపా హస్తం ఉందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్ రాజా మాటలు వింటే.. దినకరన్ వెనుక కూడా భాజపా ఏదైనా కుట్రల గోతులు తవ్వుతున్నదేమో అనే అనుమానం కలుగుతుందని పలువురు అనుకుంటున్నారు. మరి రాజా చెబుతున్నట్లు రెండు రోజుల్లో దినకరన్ కు ఎలాంటి షాక్ తగులుతుందో.. ఏంటో వేచిచూడాలి.

Tags:    

Similar News