తెరాసపై పోరాటానికి మూడో కృష్ణుడు!

Update: 2017-10-31 04:14 GMT
సుదీర్ఘంగా సాగే డ్రామాలో.. రంగస్థలం మీదికి కొన్ని అంకముల తర్వాత ఒకటో కృష్ణుడి తర్వాత రెండో కృష్ణుడు - తర్వాత మూడో కృష్ణుడు ప్రవేశించినట్లుగా ఉంటోంది పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక - అనాలోచిత నిర్ణయాల మీద సుదీర్ఘకాలంగా సాగుతున్న పోరాటం పలచబడిపోకుండా, ఆ పోరాటాన్ని కంటిన్యూ  చేయడానికి ఇప్పుడు మూడో కృష్ణుడుగా భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఇంద్రసేనా రెడ్డి రంగప్రవేశం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల మీద న్యాయస్థానం లో జరుగుతున్న పోరాటాన్ని మరింత సునిశితంగా కొనసాగించడానికి ఆయన  కూడా పిటిషన్లు వేశారు. గతంలో పిటిషన్లు వేసిన వారి నేపథ్యాలు మారిపోతుండగా.. అసలు పిటిషన్ల నడక గురించి పట్టించుకునే వారే లేకుండాపోయిన నేపథ్యంలో ఇంద్రసేనా రెడ్డి కూడా ఇదే పోరాటానికి సిద్ధం కావడం విశేషం.

వివరాల్లోకి వెళితే.. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అయినవారికి, ఆశ్రితులకు ఎడాపెడా పదవుల పందేరం చేసేశారు. వీరిలో పలువురికి కొత్త డిజిగ్నేషన్లు సృష్టించి మరీ నామినేటెడ్ పోస్టులు ప్రసాదించారు. అంతవరకూ పరవాలేదు. అలాంటి పోస్టులన్నీ కూడా కేబినెట్ హోదా తో ఉంటాయంటూ బుగ్గకార్లను కూడా ప్రసాదించారు. రాజ్యాంగ వ్యతిరేకంగా ఇలాంటి కేబినెట్ హోదా పోస్టుల్ని కట్టబెట్టడంపై గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి - తెదేపా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి హైకోర్టులో దావాలు వేసి నడుపుతున్నారు.

ఆ తర్వాతి పరిణామాల్లో గుత్తా తెరాసలోకి మారిపోయి.. తానే ఓ కేబినెట్ హోదా పోస్టును దక్కించుకునే ప్రయాసలో పడి.., పిటిషన్ సంగతి పక్కన పడేశారు. రేవంత్ కూడా కాంగ్రెసులోకి మారుతున్నారు. ఈనేపథ్యంలో  కేసీఆర్ నిర్ణయాలపై ఇక పోరాడేవారే లేరా అనిపించకుండా.. భాజపా నేత ఇంద్రసేనారెడ్డి రంగంలోకి దిగారు. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాల మీద కోర్టులో పోరాడి తీర్పులు రాబట్టిన చరిత్ర ఆయనకు గతంలోనూ ఉంది.  తొలి ఇద్దరు నాయకులు కాడి పక్కన పడేసినా.. ఇంద్రసేనారెడ్డి పోరాటం కంటిన్యూ చేయడం వలన.. ప్రభుత్వ నిర్ణయాల్లోని లోపాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నదని పలువురు అనుకుంటున్నారు. ఇద్దరు నాయకులు పోరాటాలను వదిలేసి వెళ్లిన తర్వాత.. ఇంద్రసేనా రంగప్రవేశం చేయడంతో.. ఇదే అంశం మీద మూడో కృష్ణుడిలా ఆయన వచ్చారని అంతా అనుకుంటున్నారు.
Tags:    

Similar News