మ‌జ్లిస్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన కిష‌న్ రెడ్డి

Update: 2017-11-09 06:11 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను ఆకాశానికి ఎత్తేసేలా పొగిడేసిన మ‌జ్లిస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత అక్బరుద్దీన్ వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అధికార‌ప‌క్షానికి మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించ‌న‌ప్ప‌టికీ 2019 ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేస్తామ‌న్న‌ట్లుగా మాట్లాడిన అక్బ‌రుద్దీన్‌.. రాజ‌కీయంగా హాట్ టాపిక్ గా మారారు. ఈ నేప‌థ్యంలో మ‌జ్లిస్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బీజేపీ నేత కిష‌న్ రెడ్డి.

గ‌త ప్ర‌భుత్వాలు మైనార్టీల‌కు ఏమీ చేయ‌లేదు.. టీఆర్ ఎస్ మాత్ర‌మే మైనార్టీ సంక్షేమం చూస్తుంద‌న్న‌ట్లుగా అక్బ‌రుద్దీన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కిష‌న్ రెడ్డి.. ప‌చ్చి మ‌తోన్మాద‌.. మ‌త‌సామ‌ర‌స్యాన్ని దెబ్బ తీసే పార్టీ మ‌జ్లిస్ అని మండిప‌డ్డారు. ఎప్పుడు ఏ పార్టీ ప‌వ‌ర్ లో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాయ‌టం.. ఆ పార్టీ సీఎంల‌ను భుజానికి ఎత్తుకోవ‌టం.. ఇంద్రుడు.. చంద్రుడు అంటూ పొగిడేయ‌టం గ‌తంలోనూ చూశామంటూ గుర్తు చేశారు.

ప్ర‌స్తుతం కూడా అదే తీరుతో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టిన కిష‌న్ రెడ్డి.. పాల‌క పార్టీల‌కు అండ‌గా ఉండి ఆస్తులు సంపాదించుకొని పైర‌వీలు చేసే కుటుంబ పార్టీ మ‌జ్లిస్ అని వ్యాఖ్యానించారు.

మ‌తోన్మాదాన్ని పెంచి పోషించే పార్టీతో టీఆర్ ఎస్ పొత్తు పెట్టుకుంటుందా? అన్న ప్ర‌శ్న వేసిన కిష‌న్ రెడ్డి.. ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలోనే తామంతా క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలుస్తామ‌ని మ‌జ్లిస్ నేత‌లు చెబుతుంటే.. కేసీఆర్ మౌనంగా ఉండ‌టాన్ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మౌన‌మే అంగీకార‌మా అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ప్ర‌శ్నించారు. టీఆర్ ఎస్‌.. మ‌జ్లిస్ లు రెండు క‌లిసి పోటీ చేసే విష‌యం మీద క్లారిటీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. నిండు అసెంబ్లీలో కేసీఆర్ స‌మ‌క్షంలో అక్బ‌రుద్దీన్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న చ‌ప్పుడు చేయ‌లేదంటే అక్బ‌రుద్దీన్ మాట‌ల్లో ఎంతో కొంత పాయింట్ ఉంద‌న్న విష‌యాన్ని అధికార‌ప‌క్షం ఓకే చేసిన‌ట్లుగా అనుకోక త‌ప్ప‌ద‌న్న మాట వినిపిస్తోంది. అది నిజ‌మేనా కేసీఆర్‌?
Tags:    

Similar News