ఏపీలో ఇక‌ బీజేపీది ఒంట‌రి పోరేన‌ట‌!

Update: 2017-04-13 05:49 GMT
గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో కేంద్రంలో అధికారం చేప‌ట్టిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఏపీలో పెద్ద‌గా సీట్టేమీ రాలేదు. ఓ నాలుగు అసెంబ్లీ స్థానాల‌తో పాటు మ‌రో రెండు ఎంపీ సీట్ల‌ను ఆ పార్టీ గెలుచుకుంది. అది కూడా తెలుగు నేల‌లో స్థానిక రాజ‌కీయ పార్టీగా ఉన్న టీడీపీతో దోస్తీ క‌ట్టిన కార‌ణంగానే ఆ పార్టీకి ఆ మేర సీట్లు ద‌క్కిన‌ట్లు ఎన్నిక‌ల విశ్లేష‌ణ‌లు వెలువ‌డ్డాయి. టీడీపీతో దోస్తానాతో బీజేపీకి పెద్దగా క‌లిసి రాకున్నా... బీజేపీతో మైత్రితో ఏపీలో అధికారం చేప‌ట్టేందుకు టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుకు మార్గం సుగ‌మ‌మైంద‌న్న వాద‌న లేక‌పోలేదు. బీజేపీతో పాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారం కూడా టీడీపీకి బాగా క‌లిసొచ్చింద‌ని చెప్పాలి.

అయితే రానున్న 2019 ఎన్నిక‌ల్లో ఈ ప‌రిస్థితి క‌నిపించే అవ‌కాశాలు లేవు. ఇప్ప‌టికే టీడీపీ ప్ర‌భుత్వం పాల‌నా వైఖ‌రిపై పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లు విష‌యాల‌పై నిర‌స‌న గ‌ళం విప్పుతున్నారు. నేరుగా చంద్ర‌బాబు పేరును ప్ర‌స్తావించ‌కుండానే ప‌వ‌న్ క‌ల్యాణ్ టీడీపీ స‌ర్కారుపై బ‌హిరంగంగానే నిప్పులు చెరుగుతున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న‌లో టీడీపీ స‌ర్కారు విఫ‌ల‌మైన తీరును ఆయ‌న తీవ్ర స్థాయిలో ఎండ‌గ‌ట్టిన వైనం మ‌నంద‌రికీ తెలిసిందే. ఇక ఉత్త‌రాదిలో బ‌లీయ‌మైన రాజ‌కీయ ప‌క్షంగా ఎదిగిన బీజేపీ... ఇక ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించింది.

ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో ఆ పార్టీ బాగానే బ‌ల‌ప‌డింది. తెలంగాణ‌లోనూ ఓ మోస్త‌రుగా పార్టీ బ‌ల‌ప‌డుతోంది. త‌మిళ‌నాట అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం అక్క‌డ ఏర్ప‌డ్డ రాజ‌కీయ అనిశ్చితిని త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకునేందుకు బీజేపీ ప‌క్కా వ్యూహంతోనే ముందుకు వెళుతున్న‌ట్లు పెద్ద ఎత్తున కథ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. ఇక ఉన్న‌ద‌ల్లా ఏపీ, కేర‌ళ‌లే. కేర‌ళ‌లో ఇప్ప‌టికిప్పుడు పార్టీ బ‌లోపేతంపై ఆశ‌లు లేని బీజేపీ... ఏపీలో మాత్రం స‌త్తా చాటాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఈ క్ర‌మంలో గ్రామ  స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసుకునే దిశ‌గా ఆ పార్టీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర రావు నిన్న ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు.

చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులోని ముల‌క‌ల‌చెరువు మండ‌ల కేంద్రంలో నిన్న రాజంపేట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధికి సంబంధించిన బూత్ లెవెల్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి హాజ‌రైన ముర‌ళీధ‌రరావు మాట్లాడుతూ... వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. గ‌తంలో టీడీపీతో క‌లిసి పోటీ చేశామ‌ని, అయితే ద‌క్షిణాదిలో బ‌ల‌ప‌డాల‌న్న వ్యూహంతో ముందుకు వెళుతున్న తాము... వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీతో క‌లిసి పోటీకి దిగ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాకుండా ఏపీలోని అన్ని అసెంబ్లీ,   పార్ల‌మెంటు స్థానాల నుంచి కూడా త‌మ అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగుతార‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. అంటే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు అండ్ కో... కొత్త మిత్రుడిని వెతుక్కోక త‌ప్ప‌ద‌న్న మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News