బ‌యోపిక్‌..ఎన్నిక‌ల్లో పోటీపై పురంధీశ్వ‌రీ మాట ఇది

Update: 2018-10-31 13:28 GMT
తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్‌ పై హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌పై బీజేపీ నేత‌ - కేంద్ర మాజీమంత్రి పురంధీశ్వరి స్పందించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన పురంధీశ్వ‌రి జగన్‌ పై దాడిని ఖండించారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా - రాష్ట్ర అధ్య‌క్షుడు  కన్నాలక్ష్మీనారాయణలపై దాడి జరిగిందంటే శాంతిభద్రతలు ఎంతమాత్రమో ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోగలరని ఆమె వ్యాఖ్యానించారు. తాజా దాడి నేప‌థ్యంలో ఏపీలోని లా ఆండ్ ఆర్డ‌ర్ ఎలా ఉందో అర్థం అవుతోంద‌ని పురంధీశ్వ‌రి పేర్కొన్నారు.

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ పై దాడి విష‌యంలో టీడీపీ నేత‌ల తీరును పురంధీశ్వరి తీవ్రంగా స్పందించారు. `జగన్ శరీరంలో కత్తి అంగులం దిగిందా - అర అంగులం - అంగుల్లన్నర దిగిందా అని రాష్ట్రప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైంది కాదు. ఇలాగేనా స్పందించే విధానం?` అంటూ ఆమె వ్యాఖ్యానించారు. జగన్‌ పై జరిగిన దాడిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలే తప్ప కేంద్రం ఎందుకు విచారణ జరిపించాలి అని ఆమె ప్ర‌శ్నించారు. శ్రీనివాసరావు మంచి వ్యక్తి అని ఏపీ పోలీసులే సర్టిఫికెట్ ఇచ్చారని - జగన్‌ పై దాడికి పాల్పడిన వ్యక్తికి నేరచరిత్ర ఉందనేది స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఏపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని పురంధీశ్వరి పేర్కొన్నారు. స్వామి పరిపూర్ణానందస్వామి చేరిక గురించి ఈ సంద‌ర్భంగా పురంధీశ్వ‌రి స్పందించారు. దేశం సర్వతోముఖాభివృద్థి సాధించే దిశగా మోడీ ముందుకు తీసుకెళుతున్నారని - అమిత్‌ షా-మోడీ విధానాలు న‌చ్చే ఆయ‌న త‌మ పార్టీ జెండా క‌ప్పుకొన్నార‌ని తెలిపారు. ఎమ్మెల్యే - ఎంపీగా పరిపూర్ణానందస్వామి పోటీ చేయరని వెల్ల‌డించారు.

ఎన్నిక‌ల నేప‌థ్యంలో కూట‌ముల‌పైనా పురంధీశ్వ‌రి స్పందించారు. `భావసారూప్యత లేని పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయి. బీజేపీని ఓడించడం - మోడీని గద్దెదించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ప్రజల్లో మోడీపై బలమైన నమ్మకం ఉంది. దక్షిణ భారతదేశంలో మోడీపై కొంతమంది దుష్ర్పచారం చేస్తున్నారు. కానీ వారిది దుష్పచార‌మే అని ప్ర‌జ‌లు గ్ర‌హిస్తున్నారు` అంటూ ప‌రోక్షంగా ప‌లువురు నేత‌ల‌ను ప్ర‌స్తావించారు. త‌న పోటీ గురించి ప్ర‌స్తావిస్తూ పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాన‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం రూపొందుతున్న దివంగ‌త ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర సినిమాల గురించి ప్ర‌స్తావిస్తూ...`ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం. ఎన్టీఆర్ గౌరవాన్ని దిగజార్చేవిధంగా బయోపిక్‌ లు ఉండకూడదు`` అని ఆమె ఆకాంక్షించారు. సినిమాలు నిర్మించే వారు ఈ అంశాల‌ను దృష్టిలో ఉంచుకోవాల‌న్నారు.

Tags:    

Similar News