బాబుకు కిట్టని నేతలపై భాజపా కన్ను!

Update: 2017-10-31 08:46 GMT
భారతీయ జనతా పార్టీ తాము ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేస్తాం అనే మాటను గత మూడేళ్లుగా చెబుతూనే ఉంది. కానీ పార్టీ పరంగా వారు చేసిన చర్యలేమీ లేవు. ఏపీలో రాజకీయ శూన్యత ఉంది. తెదేపా కు మేం మిత్రపక్షం అయినప్పటికీ.. మేమే ప్రధాన ప్రతిపక్షంగా ఉండగల స్థాయికి చేరుకుంటాం.. సెకండ్ పొజిషన్ కు వస్తాం.. మొత్తం నియోజకవర్గాల్లో పోటీచేసేంత బలాన్ని సంతరించుకుంటాం.. వంటి డైలాగులు అనేకమార్లు వల్లించారు గానీ.. అందుకోసం వారు చేసిందేమీ లేదు. రాష్ట్రంలోని భాజపా కీలక నాయకులు చాలా మంది.. చంద్రబాబుకు అనుగుణంగా నడుస్తున్న వాళ్లే. ఆయనను ధిక్కరించి మాట్లాడేవాళ్లు అతికొద్ది మంది మాత్రమే. అయితే తాజా పరిణామాలు గమనిస్తోంటే.. భాజపా విస్తరణ మీద దృష్టి పెట్టడం మాత్రమే కాదు.. చంద్రబాబు వ్యతిరేకులకు గేలం వేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఇదివరకట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన, చంద్రబాబు అంటే మండిపడే నాయకులు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అంతరించిపోయినా.. వారు తెదేపా వైపు మాత్రం కన్నెత్తిచూడలేదు. చంద్రబాబు తో వారికి ఉన్న వైరం అలాంటిది. అలాంటి కొందరు నాయకుల్లో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె బాబు కూడా ఒకరు. ఇప్పుడు ఆ సికెబాబును భాజపాలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

గతంలో కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన, ప్రస్తుతం భాజపాలో కీలక పదవుల్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి- సికెబాబును కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి భాజపాలో చంద్రబాబు వ్యతిరేకత అణువణువునా ఉన్న కొందరు నాయకుల్లో పురందేశ్వరి కూడా ఒకరు. అన్నీ కేంద్రం ఇస్తున్న నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదంటూ ఏమీ లేదని ఆమె పదేపదే చెబుతూ ఉంటారు. ఇలాంటి నాయకురాలు.. చిత్తూరులో చంద్రబాబుకు ఆజన్మశత్రువు అనదగిన సికెబాబును భాజపాలోకి ఆహ్వానించడం కీలకంగానే చెప్పాలి.

సికె బాబు ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. గతంలో ఇండిపెండెంటు గానూ, కాంగ్రెసు తరఫున చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వైకాపా తో కాస్త దగ్గరగా మెలిగారు గానీ.. ఆ పార్టీతో కూడా ఇటీవల విబేదాలు వచ్చి విడిపోయారు. ముఠాకక్షలు బాగా ఉండే చిత్తూరు నియోజకవర్గం పరిధిలో వాటిలో భాగంగా ఉండే సికెబాబును భాజపా లో చేర్చుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు పలువురిని ఆలోచింపజేస్తున్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా బాబుకు కంటగింపుగా మారుతాయనే అంతా అనుకుంటున్నారు.
Tags:    

Similar News