పార్టీమారితే రేవంత్‌ ను సీఎం చేస్తార‌ట‌

Update: 2017-04-16 10:15 GMT
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి అనూహ్య‌మైన ఆఫ‌ర్ వ‌చ్చింది. రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి ఆయ‌న బీజేపీలో చేరనున్న‌ట్లు వార్త‌లు జోరుగా వినిపించాయి. అయితే దీన్ని రేవంత్ ఖండించారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు ఊహించ‌ని ఆఫ‌ర్ ద‌క్కింది. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వ‌స్తే ఆయ‌న్ను సీఎంగా చేస్తామ‌ని బీజేపీ ఎమ్మెల్యే ఒక‌రు ప్ర‌తిపాద‌న పెట్టారు. ఎవ‌రా ఎమ్మెల్యే అంటే.. బీజేపీ డైన‌మిక్ ఎమ్మెల్యే రాజాసింగ్‌.

అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో ఇష్టాగోష్టిగా రాజాసింగ్ మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డికి సీఎం అయ్యే సత్తా ఉందని అన్నారు.  ఒక‌వేళ బీజేపీలోకి రేవంత్ రెడ్డి వ‌స్తే ఆయనే త‌మ‌ సీఎం అభ్యర్థి అవుతారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కాగా త‌న నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల గురించి ఈ సంద‌ర్భంగా రాజాసింగ్ ఆవేద‌న వ్యక్తం చేశారు.  ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరేందుకు సీఎంకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్తటం లేదని ఆరోపించారు. రెండు రోజుల తర్వాత సీఎం క్యాంపు ఆఫీసు ముందే కూర్చొంటానని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.

కాగా, పార్టీ మార్పుపై రేవంత్ ఇటీవ‌లే స్ప‌ష్ట‌త ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.  తాను పార్టీ మారుతున్నానంటూ కొందరు అప్రతిష్ట పాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. త‌న‌ రాజకీయ జీవితంతో ఆడుకోవాలనుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజల్లో ఉండి పనిచేస్తున్నా, నేను చేసేదంతా వాళ్లు గమనిస్తున్నారని వివరించారు. తెలంగాణలో టీడీపీ అభివృద్ధి కోసం మరింత కష్టపడి పనిచేస్తానని రేవంత్‌ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న తాను వేరే పార్టీలోకి మారుతాన‌ని ప్ర‌చారం చేయ‌డం స‌రికాద‌ని ఆయ‌న‌ అన్నారు. ఇంత కష్టపడేది బీజేపీలో చేరడానికి కాదని, అయినా ఆ పార్టీలో చేరాల్సిన అవసరం నాకేంటీ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సర్కారును ఎదిరించి పోరాడుతున్నానని వివరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న నేపథ్యంలో త‌ను బద్‌నామ్‌ చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి తీరుతానని చెప్పారు. ఏదో ఒక పార్టీలో చేరడానికి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజా సమస్యలపై సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనూ, బయటా నిలదీస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News