రూ.4ల‌క్ష‌ల కోట్ల‌కు లెక్క‌లేవి బాబూ?

Update: 2018-10-23 07:10 GMT
గ‌త నాలుగేళ్లుగా కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ తో ఏపీ సీఎం చంద్ర‌బాబు పొత్తు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. హోదా బ‌దులుగా ప్యాకేజీ ఇస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టించ‌గానే....ఢిల్లీ వెళ్లి మ‌రీ బీజేపీ పెద్ద‌ల‌కు బాబు శాలువాలు క‌ప్పి స‌న్మానాలు చేసి వ‌చ్చారు. హోదా పాచిపోయిన ల‌డ్డూ అని....ప్యాకేజీయే క్రేజీగా ఉంద‌ని డ‌ప్పుకొట్టారు. తీరా ఆంధ్రా ప్ర‌జ‌ల్లో హోదా సెంటిమెంట్ బ‌లంగా ఉంద‌ని తెలుసుకొని యూట‌ర్న్ తీసుకొని పోరాటాలు - దీక్ష‌లు అంటూ ప‌బ్బం గ‌డుపుకుంటున్నారు. ఆ ప‌బ్లిసిటీకి కేటాయించ‌డానికి స‌మ‌యం దొర‌క‌ని బాబు....రాష్ట్ర ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే  ఏపీ సీఎం చంద్ర‌బాబుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ నిప్పులు చెరిగారు. టీడీపీ అంటే ‘తెలుగు దోపిడి పార్టీ’ అని దుయ్య‌బ‌ట్టారు. అగ్రిగోల్డ్‌ బాధితుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిప‌డ్డారు. చంద్రబాబు.....గోబెల్స్ కు గురువు లాంటి వాడని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు మ‌ద్ద‌తుగా బీజేపీ చేప‌ట్టిన 5 రోజుల రిలే నిరహార దీక్షల్లో పాల్గొన్న రాం మాధ‌వ్...ఈ వ్యాఖ్య‌లు చేశారు.

గత నాలుగేళ్లలో కేంద్రం ఇచ్చిన‌వి కాకుండా అన్నిర‌కాల‌ నిధులతో కలపి రూ.4 లక్షల కోట్ల నిధులు ఏపీకి మంజూరయ్యాయ‌ని, వాటి లెక్క‌లు చంద్ర‌బాబు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఏపీకి రూ.4 లక్షల కోట్లు వచ్చినా అమ‌రావ‌తిని ఎందుకు నిర్మించ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.  ‘చంద్రన్న’ ప‌థ‌కాల‌కు నిధులిస్తోంది కేంద్రమేనన్నారు. త‌మ‌ను ప్రశ్నిస్తే ఏపీని ప్రశ్నించినట్టేన‌ని చంద్ర‌బాబు నియంతృత్వ ధోర‌ణితో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఏపీ అంటే టీడీపీ ఒక్కటే కాద‌ని - కోట్లమంది ప్రజలు - అనేక పార్టీలు - సంస్థలు కలిపే ఏపీ అని చెప్పారు.

అగ్రిగోల్డ్  వ్య‌వ‌హారంలో రూ.6,500 కోట్లు బాధితులకు చెల్లించ‌డం ప్రభుత్వానికి కష్టం కాదన్నారు. కానీ, అగ్రిగోల్డ్‌ భూములపై ప్ర‌భుత్వం కన్నేసి, లక్షలాది కుటుంబాల పొట్టలు కొట్టింద‌ని ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం నిలువెల్లా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఏం చేసినా ఎవ‌రూ అడ‌గ‌కూడ‌ద‌న్నట్లు చంద్ర‌బాబు పాలిస్తున్నారని, ఇది హిట్లర్‌ తరహా పాలనేన‌ని దుయ్యబట్టారు.

ఏపీలో టీడీపీ నేతలు - మంత్రులు గోబెల్స్ లని - ఎందరో గోబెల్స్ కు చంద్రబాబు బాస్ అని ఎద్దేవా చేశారు. అటువంటి ఆంబోతులతో  కేంద్రంపైనా - మోదీపైనా - బీజేపీ నేత‌ల‌పైనా ఇష్టమొచ్చినట్టు చంద్ర‌బాబు మాట్లాడిస్తున్నారని విమర్శించారు. కక్ష సాధించాలంటే రమేష్ కన్నా పెద్ద నాయకులే ఉన్నారని అన్నారు. చ‌ట్టప్రకారం అవినీతిపరులను జైలుకు పంప‌డం కేంద్రం ఉద్దేశ‌మ‌న్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించార‌ని, ఇప్ప‌టి నేత‌లు దానిని....తెలుగు ద్రోహుల పార్టీగా మార్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ చంకలో టీడీపీ కూర్చుంద‌ని, ఏపీలో దాన్ని భుజాన ఎత్తుకొని రాజకీయాలు చేస్తున్నారని రాంమాధవ్ దుయ్య‌బ‌ట్టారు.
Tags:    

Similar News