ఇది బెంగళూరు.. కాదు ముమ్మాటికీ హైద‌రాబాదే!

Update: 2022-10-13 05:37 GMT
ఇటీవ‌ల భారీ వ‌ర్షాల ధాటికి వెల్లువెత్తిన‌ వ‌ర‌ద‌ల‌తో బెంగ‌ళూరు న‌గ‌రం బెంబేలెత్తింది. నెల‌కు కోట్ల రూపాయ‌లు వేత‌నాలు తీసుకునేవారు సైతం త‌మ డూప్లెక్స్ హౌసుల‌ను, విల్లాల‌ను వ‌దిలిపెట్టి ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌లో రోజుల త‌ర‌బ‌డి కుటుంబాల‌తో స‌హా ఉండాల్సి వ‌చ్చింది. ఇక మామాలు ప్ర‌జ‌ల క‌ష్టాలు చెప్పాల్సిన ప‌నిలేదు. బెంగ‌ళూరులో ఈ భారీ వ‌ర‌ద‌ల‌కు అక్ర‌మ నిర్మాణాలు, క‌ట్ట‌డాలు కార‌ణ‌మ‌ని తేల్చిన ప్ర‌భుత్వం వాటిని కూల్చేప‌నిలో ఉంది.

ఇక ఇప్పుడు అచ్చం బెంగ‌ళూరు మాదిరే మ‌రో ఐటీ న‌గ‌రం హైద‌రాబాద్ ప‌రిస్థితి త‌యారైంది. హైదరాబాద్‌లో అక్టోబ‌ర్ 12 బుధ‌వారం రాత్రి వర్షం మళ్లీ దంచికొట్టింది. ఉరుములు మెరుపులతో నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా కుండపోత వాన ప‌డింది. మునుపెన్నడూ లేనంత పిడుగుల మోతతో నగరం ద‌ద్ద‌రిల్ల‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ప‌లు ప్రాంతాలు నీట మునిగాయి. అపార్టుమెంట్లు సైతం నీటి ముంపులో చిక్కుకున్నాయి. దీంతో కార్లు, ద్విచ‌క్ర‌వాహ‌నాలు ఆట‌బొమ్మ‌ల్లా కొట్టుకుపోయాయి.

భారీ వరద రహదారులపైకి రావడంతో పలు ప్రాంతాల్లో వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్ట, బేగంపేట్, యూసుఫ్‌గూడ, షేక్‌పేట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఆర్సీపురం, రాజేంద్రనగర్, బండ్లగూడ, గొల్కొండ, నార్సింగి, పుప్పాలగూడ, మైలార్ దేవులపల్లి, మణికొండ, గండిపేట, షాద్‌నగర్, కూక‌ట్ ప‌ల్లి, నిజాంపేట‌, బాచుప‌ల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

నగరంలో అక్టోబ‌ర్ 12 రాత్రి కురిసిన జడివాన  రోడ్లను ముంచెత్తింది. ఓవైపు వరద నీరు, మ‌రోవైపు డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వీధులన్నీ చెరువులను తలపించాయి. చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతులో నీరు నిలిచింది. దీంతో హైద‌రాబాద్ ప్ర‌జ‌లు చుక్క‌లు చూశారు. చాలాచోట్ల ద్విచక్ర వాహనాలు, ఆటోలు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల కార్లు, ఆటోలు నీట మునిగి పాడ‌య్యాయి.

పలు ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర‌ ఇబ్బందులు పడ్డారు. రసూల్‌పురాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి వరద నీరు చుట్టుముట్టింది. బోరబండ సహా అనేకచోట్ల ద్విచక్ర వాహనాలు, ఆటోలు కొట్టుకుపోయాయి. ఎర్రగడ్డ మెట్రో కింద భారీగా వ‌ర‌ద‌ నీరు చేరింది.

కాగా బుధ‌వారం రాత్రి 11 గంటల వరకు బాలానగర్‌లో అత్యధికంగా 10 సెంటీ మీటర్ల వర్షపాతం ప‌డింది. వచ్చే రెండు రోజుల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయ‌డంతో న‌గ‌ర వాసులు భీతిల్లుతున్నారు.  

మ‌రోవైపు ప్ర‌జ‌లు ఈ వ‌ర‌ద‌ల‌తో అష్ట‌క‌ష్టాలు ప‌డుతుంటే రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఇటీవ‌ల బెంగళూరు వ‌ర‌ద‌ల‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ సుర‌క్షిత‌మ‌ని.. ఐటీ కంపెనీలు హైద‌రాబాద్ రావాలంటూ కోరారు. ఇప్పుడు దీనిపై బీజేపీ నేత‌లు ఆయ‌న‌కు కౌంట‌ర్లు ఇస్తున్నారు. బెంగ‌ళూరులో ఏక‌ధాటి వ‌ర్షాల‌తో ఇబ్బంది ప‌డింద‌ని.. కానీ హైద‌రాబాద్ ఒక్క రోజు వాన‌కే అల్ల‌క‌ల్లోల‌మైంద‌ని దెప్పిపొడుస్తున్నారు. మాట‌లు మాని హైద‌రాబాద్ అభివృద్ధిపై దృష్టి పెట్టాల‌ని కేటీఆర్‌కు చుర‌క‌లు అంటిస్తున్నారు.

అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని పక్కరాష్ట్రాలకు బోధిస్తున్న కేటీఆర్.. హైదరాబాద్‌లో రోడ్లు, డ్రైనేజీల దుస్థితి గురించి ఏం చేస్తున్నారంటూ వీడియోలతో సహా ప్ర‌శ్నిస్తున్నారు. ఇది బెంగళూరు, అహ్మదాబాద్‌, ఏ వెనిసో కాదని.. హైదరాబాదేనని ఎద్దేవా చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Video Here>> https://www.facebook.com/watch/?v=453080363581702
Tags:    

Similar News