భాజపా వెటకారం.. రెండో రాజధాని కావాలంట!

Update: 2018-02-23 16:33 GMT
‘‘నాకే లేదు నాకుడు బెల్లం అంటే.. నీకెక్కడ యిచ్చేది గోకుడు బెల్లం..’’ అని మన పల్లెపట్టుల్లో ఒక మోటు సామెత ఉంటుంది. ఆ సామెత చందంగా కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితి! దిక్కూ మొక్కూ లేకుండా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని కూడా లేని నేపథ్యంలో శంకుస్థాపనలు చేసిన నగరం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పడి ఉంటే.. ఈ రాష్ట్రానికి రెండో రాజధాని కూడా కావాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రపంచ స్థాయి రాజధాని చేసేస్తానని డాంబికంగా చంద్రబాబునాయుడు ప్రకటించిన రాజధానికి  ఇవ్వవలసిన నిధులు కూడా ఇవ్వకుండా కేంద్రంలోని భాజపా ఒకవైపు నాటకాలు ఆడుతోంది. మరోవైపు ఈ రాష్ట్రానికి రెండో రాజధాని కూడా కావాలంటూ రాష్ట్రంలోని భాజపా నాయకులు ఒక అపభ్రంశపు ప్రతిపాదన తెస్తున్నారు.

తెలుగుదేశం మీద పోరాటం సాగించడంలో - చంద్రబాబును ఇరుకున పెట్టడంలో రాష్ట్రంలోని భాజపా నాయకులు ఎవరికి వారు తమ అస్తిత్వాన్ని ప్రదర్శించుకోవడానికి అత్యుత్సాహం చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మైలేజీ మొత్తం కోస్తాంద్ర లోని భాజపా నాయకులే కొట్టేస్తున్నారని వారికి అసూయ పుట్టిందో ఏమోగానీ.. రాయలసీమ భాజపా నాయకులంతా కర్నూలు లో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో భాజపా వారి ప్రధాన తీర్మానం.. రాయలసీమలో రెండో రాజధాని కావాలన్నదే కావడం విశేషం. ఈ రాజధాని కింద అక్కడ సచివాలయం - అసెంబ్లీ - గవర్నర్  - ముఖ్యమంత్రుల తాత్కాలిక విడిది నివాసాలు ఏర్పాటు చేయాలిట. ప్రతి ఆరునెలలకు ఓసారి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలట. చంద్రబాబునాయుడు ప్రభుత్వం రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయడానికి తక్షణమే అధికారిక ప్రకటన విడుదల చేయాలంటూ భాజపా డిమాండ్ చేయడం పెద్ద కామెడీగా ప్రచారం అవుతోంది.

తిరుపతిలో జరిగిన సభలో అప్పట్లో ప్రధాని అభ్యర్థి మోడీ ఢిల్లీని మించిన రాజధాని నగరాన్ని మీకు నిర్మించి ఇస్తాం అంటూ గట్టి హామీనే ఇచ్చారు. తిరుపతికేంద్రంగా రాయలసీమ ప్రజలంతా ఆ మాటలు నమ్మారు. మరి ఏమైంది. కేవలం 2500 కోట్లను ఇప్పటిదాకా విడుదలచేసి.. ఇంకా ఏం ఇవ్వాలి.. అని అడుగుతున్నారు. కోర్ కేపిటల్ అనే దానికి సంబంధించి అరుణ్ జైట్లీ వచ్చి పునాది వేశారు గానీ.. ఒక్క రూపాయి విడుదల చేయలేదు. అమరావతి కి సాక్షాత్తూ ప్రధాని శంకుస్థాపన చేసినా నిధులకు దిక్కూమొక్కూ లేదు. ఒక రాజధాని అనుకుంటేనే నయాపైసార  రాలడం లేదు. మరి రెండో రాజధానిని ప్రకటిస్తే నిధులు ఎక్కడినుంచి వస్తాయని భాజపా వారు అనుకుంటున్నారో తెలీడం లేదు.
Tags:    

Similar News