పెద్ద‌ల వైఖ‌రితో బీజేపీ కేడ‌ర్ అయోమ‌యం

Update: 2016-08-07 07:34 GMT
`2019 నాటికి తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలి` ఇదీ బీజేపీ 2014లో బీజేపీ అధిష్టాన వ్యూహం. కానీ రెండేళ్ల‌లోనే ఇది త‌ల్ల‌కిందుల‌య్యింది. అస‌లు ఆంధ్రప్ర‌దేశ్‌లో మిత్ర ప‌క్షంగా ఉన్న టీడీపీతో `హోదా` విషయంలో ఎటూ తేల్చుకోలేక‌పోతోంది. ఇక తెలంగాణ‌లో ఎప్పుడెప్పుడు కారెక్కుదామా అని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అయితే ఈ వైఖ‌రి మాత్రం ఇరు రాష్ట్రాల్లోని బీజేపీ నాయ‌కుల‌ను తిక‌మ‌క పెడుతోంద‌ట‌. `హోదా ఇవ్వ‌క‌పోతే ఏపీలో మ‌న పార్టీ ప‌రిస్థితి ఏంటి? టీడీపీతో తెగ‌దెంపులు చేసుకోవాలా? ఒక‌వేళ తెగదెంపులు చేసుకుంటే రాష్ట్రంలో సొంతంగా ఎద‌గ‌గ‌ల‌మా?` ఇదీ ఏపీ బీజేపీ నాయ‌కుల మ‌దిలోని ప్ర‌శ్న‌లు!!

   ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రత్యేకహోదా రాదని బీజేపీ నాయకుడు - మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యానించ‌గా.. తన భార్యకూడా `ప్రత్యేక హోదా`నే కోరుతున్నదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బహిరంగంగా వ్యాఖ్యానించడం ఆపార్టీ రాష్ట్రశాఖలో విభేదాల‌ను బయటపెడుతున్నాయి. అలాగే అధ్య‌క్ష ఎంపికలో కూడా జాప్యం పార్టీలో వ‌ర్గాలు ఏర్ప‌డ్డానికి కారణంలా క‌నిపిస్తోంది. తెలుగుదేశంతో సంబంధాలు ఎలావుండాలో తేల్చుకోలేకపోవడమే ఈ ప్రతిష్టంభనకు మూలమ‌ని విశ్లేష‌కుల అభిప్రాయం.

  ఇక తెలంగాణ నాయ‌కుల పరిస్థితి ఇంకోలా ఉంది. రెండేళ్ల త‌ర్వాత తొలిసారి ప్ర‌ధాని తెలంగాణ‌కు వ‌స్తున్నారు. తెలంగాణ‌-కేంద్రం మ‌ధ్య సన్నిహిత సంబంధాలు బ‌ల‌ప‌డుతున్నాయి. సీఎం కేసీఆర్‌తో దోస్తీకి ప్ర‌ధాని ఆసక్తిచూపుతున్నారు. దీంతో త‌మ‌కు ప్రాధాన్యం ద‌క్క‌కుండా పోతుంద‌ని బీజేపీ నాయ‌కులు కంగారుప‌డుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో బీజేపీ అగ్రనాయకత్వం వైఖరి తెలుగురాష్ట్రాల్లో ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నచ్చడం లేదు. హైకమాండ్ కు ఆంధ్రప్రదేశ్ శాఖ తలనొప్పిగా మారిపోగా, హైకమాండే తెలంగాణా శాఖకు తలనొప్పిగా మారింది. ఈ రెండు చోట్ల ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీ ప‌రిస్థితి మ‌రింత డౌన్ అవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.
Tags:    

Similar News