తెలంగాణ బీజేపీ నేతలకు రాజ్యసభ చాన్సు.. ఎక్కడి నుంచి అంటే!

Update: 2022-05-24 08:32 GMT
తెలంగాణలో వచ్చే ఏడాది (2023) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత బీజేపీ అధికారంలోకి రావడానికి ఆశలు కల్పిస్తున్న రాష్ట్రం.. తెలంగాణ. ఎందుకంటే ఆ పార్టీకి బీజేపీ తరఫున నలుగురు పార్లమెంటు సభ్యులు అక్కడ ఉన్నారు. ఆ నలుగురు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. అలాగే దుబ్బాక, హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేలు రఘనందన్ రావు, ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. తెలంగాణకే చెందిన బండారు దత్తాత్రేయ హరియాణా గవర్నర్ గా ఉన్నారు. హుజురాబాద్, దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ ఎవరూ ఊహించని అద్బుత ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణను చుట్టేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి సంజయ్, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావులు.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా మాటల దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దూకుడును మరింత పెంచడానికి.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడానికి కొంతమంది తెలంగాణ బీజేపీ నేతలకు ఆ పార్టీ అధినాయకత్వం రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టనుందని తెలుస్తోంది.

తెలంగాణలో బీజేపీ తరఫున కీలక నేతలుగా ఉన్న విజయశాంతి, డీకే అరుణ, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ ఇంద్రసేనారెడ్డి, మురళీధరరావు తదితరుల్లో ఒకరిద్దరిని రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోందని సమాచారం. అయితే.. వీరిని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడానికి అవసరమైనంత ఎమ్మెల్యేలు బీజేపీకి లేరు. ఈ నేపథ్యంలో వీరిని బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి పంపడానికి పావులు కదుపుతోంది.

ఇప్పటికే కేరళ నుంచి సినీ నటుడు సురేష్ గోపిని రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేశారు. ఇక తమిళనాడుకు చెందిన మురుగన్ ను, కేరళకు చెందిన మురళీధర్ ను ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపింది. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకయ్య నాయుడిని కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిన సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుత రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందినవారే. ఈయనను కూడా ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపారు. ఇదే విధానంలో తెలంగాణ బీజేపీ నేతలను కూడా త్వరలో ఖాళీలు కానున్న బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది.

ఇలా తెలంగాణకు చెందిన పలువురిని రాజ్యసభకు పంపితే ఆ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని అధినాయకత్వం భావిస్తోంది. పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా ఉంటాయని తలపోస్తోంది. దీంతో తెలంగాణ బీజేపీ ఆశావహులు ఆశల పల్లకీలో ఊగుతున్నారు. సామాజిక సమీకరణలు, సీనియారిటీ, పార్టీకి చేసిన సేవలను అంచనా వేసుకొనే అభ్యర్థిని నిర్ణయించనున్నారని తెలుస్తోంది. ఈ నెలాఖరుతో రాజ్యసభ నామినేషన్‌ గడువు ముగియనుంది. దీంతో రెండుమూడు రోజుల్లోనే దీనిపై బీజేపీ అధిష్టానం తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నట్లు సమాచారం.
Tags:    

Similar News