అధికారం చేతిలో ఉంటే తప్పులు చేస్తారా రేవంత్?
అయితే.. అంత కష్టపడిన తర్వాత సొంతం చేసుకున్న అధికారాన్ని.. సరైన పద్దతిలో ప్రదర్శించే తీరులో మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తారు.
అధికారం చేతిలోకి వచ్చేందుకు పడే తిప్పలు.. ప్రదర్శించే ఆరాటం అంతా ఇంతా కాదన్నట్లుగా రాజకీయ నేతల్లో కనిపిస్తూ ఉంటుంది. తమ చేతికి పవర్ వచ్చేందుకు వారు పడే శ్రమ అంతా ఇంతా కాదు. అయితే.. అంత కష్టపడిన తర్వాత సొంతం చేసుకున్న అధికారాన్ని.. సరైన పద్దతిలో ప్రదర్శించే తీరులో మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తారు. పవర్ చేతిలో లేనప్పుడు పవర్ ఉన్న ప్రత్యర్థి చేసే తప్పుల్ని అదే పనిగా చెప్పే వారు.. తమ చేతికి అదే పవర్ వచ్చిన తర్వాత అలాంటి తప్పులే చేయటం దేనికి నిదర్శనం?
తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే తీసుకుంటే.. విపక్ష నేతగా సుదీర్గకాలం అనుభవం ఉన్న ఆయన.. కేసీఆర్ మొదలు కొని అధినేత ఎవరైనా సరే.. వారు చేసే తప్పుల్ని చిట్టా మాదిరి చెప్పినప్పుడు.. విషయాల్ని ఎంత లోతుగా పరిశీలిస్తారన్న భావన కలుగుతుంది. ఈ తరహా సెన్సిబులిటీ ఉన్న వారి చేతికి పవర్ వస్తే.. తప్పులే చేయరన్న భావన కలుగుతుంది.కానీ.. వాస్తవంలో అందుకు భిన్నమైన పరిస్థితి ఇప్పుడు ఉందని చెప్పాలి.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ ప్రమాదంలో 8 మంది చిక్కుకుపోవటం.. వారిని బయటకు తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయటం తెలిసిందే. అయితే.. కాలం గడుస్తున్న కొద్దీ.. టన్నెల్ లో చిక్కుకుపోయిన వారి ప్రాణాలకు ముప్పు అంతకంతకూ పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మంత్రులు సైతం.. వారి విషయంలో తక్కువ అవకాశం ఉన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఈ ఉదంతానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విచిత్రమైన విమర్శకు గురి అవుతున్నారు.
టన్నెల్ ప్రమాదం వద్దకు వచ్చి.. అక్కడి పరిస్థితి గురించి ఆరా తీసి.. అధికారులకు తగిన సూచనలు ఇవ్వాల్సింది పోయి.. పట్టభద్రుల ఎన్నికల ప్రచారానికి వెళ్లటం ఏమిటి? అంటూ విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రికి 8 మంది ప్రాణాలు అవసరం లేదా? ఎన్నికల్లో ఓట్లు మాత్రమే కావాలా? అని మండిపడుతున్నారు. అయితే.. ఈ విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు వేరుగా ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ముఖ్యమంత్రి వస్తే సెక్యూరిటీ సమస్య వస్తుందని.. రెస్క్యు ఆపరేసన్ కు ఆలస్యం అవుతుందని.. ఈ కారణంతోనే ముఖ్యమంత్రి రాలేదని చెబుతున్నారు.
ప్రమాదం జరిగింతనే నలుగురు మంత్రులు.. పెద్ద ఎత్తున అధికారులు ఇక్కడే ఉన్నామని.. ముఖ్యమంత్రి రాలేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల్లో బలం లేదని వారు చెబుతున్నారు. కేటీఆర్ లాంటోళ్లు సంస్కారం నేర్చుకోవాలంటూ కోమటిరెడ్డి మండిపడ్డారు. అయితే.. ప్రమాదస్థలానికి ముఖ్యమంత్రి రేవంత్ కొద్ది నిమిషాల పాటు అయినా సరే వెళ్లి ఉండాల్సిందన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది. ముఖ్యమంత్రి వెళితే.. సహాయక చర్యలకు ఆటంకం కలిగే మాటలో వాస్తవం ఉన్నప్పటికి.. కొన్ని అంశాల విషయంలో టైమ్లీగా నిర్ణయాలు తీసుకోవాలే తప్పించి.. ఒకేలాంటి మైండ్ సెట్ తో ఉండటం సరికాదంటున్నారు.
అధికారంలో లేనప్పుడు.. ఏదైనా కష్టం వస్తే అప్పటి సీఎం కేసీఆర్ వెళ్లకుండా ఫాంహౌస్ లో నిద్ర పోతున్నట్లుగా ఇదే రేవంత్ వ్యాఖ్యలు చేసేవారు. ఇప్పుడు తాను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు గతంలో తాను చెప్పిందే చేయాలన్న విషయాన్ని రేవంత్ ఎందుకు మర్చిపోతున్నట్లు? ఒకవేళ నిజంగానే వెళ్లలేని పరిస్థితే ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోతే ఏమవుతుంది? దానికి బదులు సచివాలయంలో కూర్చొని.. రెస్క్యూ ఎంతవరకు వచ్చింది? మరిక ఏం చేయాల్సి ఉంటుంది? లాంటి అంశాల మీద రివ్యూ చేసినా బాగుండేది.
అందుకు భిన్నంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లటం మాత్రం సీఎం రేవంత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మారిందన్న మాట వినిపిస్తోంది. విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనేం మాటలు చెప్పారో.. అధికారం చేతిలో ఉన్న వేళలో అలా చేయకుండా ప్రత్యర్థులకు అవకాశాన్ని ఇవ్వటాన్ని తప్పు పడుతున్నారు. ఈ విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కు మాత్రమే సాధ్యమైందన్న మాట వినిపించక మానదు. పవర్ చేతిలో ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ గుర్తిస్తే మంచిది.