ఎమ్మెల్సీ ఎన్నికలు... సీబీఎన్, లోకేష్, పవన్ పరిస్థితి ఇదే!

ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో సాంకేతికతను వినియోగించి, ప్రతీ ఓటరును అభ్యర్థించాలని కోరారు.

Update: 2025-02-25 06:30 GMT

ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక ఈ నెల 27న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ఈ ఎన్నికలపై టీడీపీ సీనియర్ నేతలకు.. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో సాంకేతికతను వినియోగించి, ప్రతీ ఓటరును అభ్యర్థించాలని కోరారు.

ఇదే సమయంలో.. ఎన్నికల రోజు పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించేందుకు వార్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ముందురోజు శివరాత్రి పండుగ నేపథ్యంలో ప్రతీ ఓటరూ పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ఈ ఎన్నికల్లో తొలి ప్రాధాన్య ఓట్లతోనే కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించాలని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పరిధిలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కు పొందగా... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

అవును... చంద్రబాబు, నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పరిధిలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కు పొందారు. ఈ నేపథ్యంలో.. ఈ నెల 27న తాడేపల్లి మండలం, గాదె రామయ్య, సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జగన్ ఓటు మాత్రం పులివెందులలోనే ఉంది.

అయితే.. మంగళగిరి నియోజకవర్గంలోనే ఉంటున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పట్టభద్రుడు కాకపోవడంతో ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

మరోపక్క.. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా.. మార్చి 3న నోటిఫికేషన్ రానుండగా.. ఆ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. వీటి స్వీకరణకు తుది గడువు మార్చి 10 కాగా.. ఎన్నిక మార్చి 20న జరగనుంది.

Tags:    

Similar News