పవన్ నోట మళ్లీ సనాతనం మాట.. ఈసారి మరింత బలంగా
అందుకే.. అలాంటి స్టీరియో టైప్ తీరును బద్ధలు కొట్టే వారు వచ్చినప్పుడు.. వారి విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంటుంది.
రోటీన్ కు భిన్నంగా రాజకీయం చేసే వారిని అర్థం చేసుకోవటం కంటే అపార్థం చేసుకోవటమే ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయం చేయటమంటే.. ఫలానా ఫార్మాట్ లో మాత్రమే చేయాలన్న భావన ప్రజల్లోనే కాదు.. రాజకీయ నాయకుల్లోనూ.. చివరకు మీడియాలోనూ ఒకలాంటి తప్పుడు భావన ఉంటుంది. అందుకే.. అలాంటి స్టీరియో టైప్ తీరును బద్ధలు కొట్టే వారు వచ్చినప్పుడు.. వారి విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంటుంది.
జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విషయానికి వస్తే.. ఇదే తీరు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఆయన నోటి నుంచి సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు.. దానికి సంబంధించి తన వాదనను వినిపించినప్పుడు అందుకు సానుకూలంగా స్పందించినోళ్లు తక్కువగా కనిపిస్తారు. వామపక్ష మేధావుల గురించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. సనాతనం.. ధర్మం.. హిందూయిజం గురించి మాట్లాడిన అధినేత ఎవరైనా సరే.. బ్లాక్ లిస్టులో వేసినట్లుగా వారి వ్యాఖ్యలు ఉంటాయి.
అయితే.. పవన్ కల్యాణ్ విషయంలో ఎప్పటిలానే మరోసారి తప్పు జరిగిందన్న విషయం తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని శ్రద్ధతో విన్నప్పుడు అర్థమవుతుంది. సనాతనం గురించి ఆయన మాట్లాడిన సందర్భంలో చాలామంది చాలానే ఎటకారాలు చేసుకున్నారు. పెద్దగా సీరియస్ గా తీసుకున్నది లేదు. కానీ.. తరచూ ఆయన మాట్లాడే సనాతన ధర్మం.. దానికి సంబంధించిన అంశాలు ఇప్పుడిప్పుడే సీరియస్ గా ఫోకస్ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది.
పొలిటికల్ వ్యూహంలో భాగంగా పవన్ నోటి నుంచి సనాతనం మాటలు వస్తున్నాయన్న తప్పుడు భావనలో ఉన్నోళ్లు సైతం.. తమ ఆలోచనల తీరును మార్చుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. దీనికికారణం లేకపోలేదు. సనాతన ధర్మం.. దానికి సంబంధించిన అంశాల గురించి పవన్ తరచూ మాట్లాడుతున్న మాటల్లో మరింత స్పష్టత రావటమే దీనికి కారణంగా చెప్పాలి. తాజాగా పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ధర్మం తాలూకూ గొప్పదనం పాఠ్యాంశాల్లో లేదని.. ఎంతవరకు జరిగిన యుద్ధాల గురించి చెబుతున్నట్లుగా వ్యాఖ్యానించారు.
‘సనాతన ధర్మాన్ని పాటించిన పాలకుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటీవల నేను మధురైలోని మీనాక్షి దేవాలయానికి వెళ్లా. అమ్మవారి మూల విగ్రహానని ఎలా దాచిపెట్టారో అక్కడి పూజారులు వివరించారు. అన్ని మతాలు సమానమని చెప్పిన హిందూ ధర్మాన్ని చాలామంది తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆ విషయంలో నాకు ఇబ్బంది అనిపించింది. నేను మంకుపట్టు పట్టే హిందువును కాను. కానీ.. అన్ని మతాలు బాగుండాలని చెప్పేవాడిని’’ అంటూ తన సనాతన ధర్మం పాలసీ గురించి వివరంగా చెప్పుకొచ్చారు.
తన ధర్మంపై దాడి చేస్తున్నప్పుడు ఓట్లు వస్తాయా? పోతాయా? అన్నది తనకు తెలీదని.. ఏ దేవుడైతే ఉనికి ఇచ్చాడో.. ఏ పరమాత్మ స్థానం ఇచ్చాడో.. ఆయన్ను కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులు వచ్చినా ప్రయోజనం ఉందదన్న పవన్.. ‘‘రాజకీయంగా ఇతర మతాలపై దాడి జరుగుతుంటే వెనకేసుకొస్తాం. హిందూ ధర్మంపై దాడి జరుగుతుంటే ఒక్కరూ మాట్లాడరు. ఎందుకు? ఓట్లు పోతాయని. దీనిపై లోతుగా చర్చ జరగాలి. చరిత్ర గురించి మాట్లాడాలి’ అంటూ మరింత వివరంగా మాట్లాడిన మాటల్ని చూస్తే.. సనాతన ధర్మం గురించి పవన్ అవసరానికి ఏదో నాలుగు మాటలు మాట్లాడే అధినేతగా కనిపించరని చెప్పక తప్పదు.