పవర్ లేదు.. నాలుగు మాటలు పడితే మంచిదేగా జగన్?
పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదన్న పాత సామెతను ఏపీ విపక్ష నేత.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్జెంట్ గా గుర్తిస్తే మంచిది.
పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదన్న పాత సామెతను ఏపీ విపక్ష నేత.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్జెంట్ గా గుర్తిస్తే మంచిది. తిరుగులేని అధికారం చేతి నుంచి లాగేసి మరీ.. తన ప్రత్యర్థి పార్టీకి ప్రజలు కట్టబెట్టిన వేళ.. ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించాల్సిన అవసరం ఉంది కదా? తనకు లేని దాని గురించి అదే పనిగా మాట్లాడే బదులు.. తాను చేయగలిగింది చేసుకుంటూ పోతే ఏమవుతుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ.. తాను మరో ముప్ఫై ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని చెబుతున్నప్పుడు.. కొన్ని అంశాల మీద మొండి పట్టుదలను ప్రదర్శించటంలో అర్థం లేదు.
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు పదిశాతం సీట్లు సదరు పార్టీకి ఉందాలి. ఈ లెక్కన ఏపీ అసెంబ్లీలో 194 స్థానాలు ఉన్నాయి. పది శాతం అంటే.. కనీసం 20 స్థానాలు వైసీపీ సొంతమై ఉండాలి. కానీ.. ఆ పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు కేవలం 11 మాత్రమే. అంటే.. ప్రతిపక్ష హోదాకు మరో 9 సీట్లు అవసరం. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. అధికార పక్షంలో భాగస్వామి అయిన జనసేనకు 21 సీట్లు వచ్చాయి. ఈ లెక్కన ప్రధాన ప్రతిపక్షంగా హోదా దక్కాలంటే.. జనసేనకు వచ్చిన 21 స్థానాలకు అదనంగా ఒక్కస్థానం వచ్చినా సరిపోతుంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా.. చేతిలో ఉన్న పరిమిత సీట్లకు అపరిమితమైన అవకాశాలు తమ సొంతం కావాలని అడటంలో అర్థం లేదు.
నిజానికి విపక్షంలో ఉన్న వేళ ఎంత తగ్గితే అంత మంచిది. అధికారపక్షం ప్రదర్శించే పవర్.. ప్రతిపక్షానికి సానుభూతిగా మారి.. ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. అధికారపక్షం చేతిలో ఎన్ని అవమానాలకు గురైతే విపక్షానికి అంత మంచిది. అంతేతప్పించి.. అధికారపక్షానికి ఉండే పవర్.. ప్రతిపక్షంగా తమకు కూడా ఉండాలని వాదించటంలో అర్థం లేదు. ఈ చిన్న విషయాన్ని జగన్ ఎందుకు మిస్ అవుతున్నారు? అధికారం నుంచి తనను పక్కకు తప్పించిన ప్రజలు కోరుకునేది ఏంటి? అన్న విషయం మీద జగన్మోహన్ రెడ్డి కాస్తంత ఫోకస్ పెట్టాలి.
తన నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలే కానీ.. తాను అనుకున్నది మాత్రమే చేస్తానని.. దానికి ప్రజలు కూడా ఆమోదముద్ర వేయాలన్న తీరు జగన్ కు మాత్రమే కాదు వైసీపీకి కూడా మంచిది కాదు. అందుకే.. పవర్ లేని వేళ.. అధికారపక్షం అనే నాలుగు మాటలు పడితే పోయేదేమీ లేదు. అధికారపక్షం తనను నాలుగు మాటలు అనే అవకాశాన్ని ఇవ్వని జగన్.. తప్పు మీద తప్పు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవర్ చేతిలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించే ధోరణి.. రానున్న రోజుల్లో జగన్ అండ్ కోకు వరంగా మారుతుందన్న విషయాన్ని ఆయన కానీ ఆ పార్టీ నేతలు కానీ అర్జెంట్ గా గుర్తించాల్సిన అవసరం ఉంది.