దేవదూత.. గంగానది.. సాధువు.. మోడీ

Update: 2016-12-22 05:53 GMT
రాజకీయాల్లో అధినేతలను పొగడటం అనేది చాలా సహజమైన విషయం. ఈ విషయంలో ఆయా నేతలంతా తెగ పోటీపడిపోతుంటారు. వ్యక్తిపూజకు ఆయా రాజకీయ పార్టీల్లో ఉండే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే సామర్ధ్యం కంటే కొన్ని సందర్భాల్లో ఈ పొగడ్తలకే ఎక్కువ క్రెడిట్ దక్కిన సందర్భాలకు కూడా కొదవలేదని సీనియర్లు చెబుతుంటారు. అయితే ఇంతకాలం ఎప్పుడూ లేని స్థాయిలో ప్రధాని మోడీపై పొగడ్తల వర్షాలు కురుస్తున్నాయనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వ్యక్తిపూజ అవసరమో కాదో తెలియదు కానీ అదికాస్త శృతిమించితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయనేది మరికొంతమంది అనుభవజ్ఞుల మాటగా ఉంది. ఇంతకూ ఈ ఉపోద్గాతం అంతా ఎందుకంటే... మోడీని బీజేపీ నేతలు పొగుడుతున్న విషయంపైనే!!

"కష్టాల్లో ఉన్న భారతదేశాన్ని రక్షించడానికి దిగివచ్చిన దేవదూతే మోడీ"... ఈ మాట అన్నది మరెవరో కాదు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు! దేశప్రధానికి దేవదుత అనేసే స్థాయిలో ఆయన పొగడ్తల విషయంలో అందరికంటే ముందువరుసలో ఉన్నారు. ఈ విషయంలో వెంకయ్యతో పోడీపడటానికి మిగిలిన బీజేపీ నేతలు తమవంతు ప్రయత్నాలు చేసినప్పటికీ... ఈ విషయంలో ఇప్పటివరకూ వెంకయ్యదే ప్రధమ స్థానం. అయితే కనీసం తర్వాతి స్థానాల్లో అయినా నిలవాలనే తపనతో మిగిలిన కేంద్రమంత్రులు - బీజేపీ నేతలు పోటీపడుతున్నట్లుంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గంగానది అంతటి పరిశుద్ధుడని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అభివర్ణించారు. గంగానది ఎప్పుడో కలుషితం అయిపోయిందనే కామెంట్స్ వెంటనే వినిపించాయనుకోండి.. అది వేరే విషయం. అమ్మో... రెండో స్థానానికి రవిశంకర్ దూసుకుపోతున్నారని భావించారో ఏమో కానీ... వెంటనే రంగంలోకి దిగారు కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ. ఈయన మోడీని సాధువు గా అభివర్ణించారు. పేదల అభ్యున్నతికి ప్రధాని నరేంద్రమోడీ ఒక సాధువులాగా పని చేస్తున్నారని ఆయన అన్నారు. ఏది ఏమైనా... ప్రజలు ఇరిటేషన్ లో ఉన్నప్పుడు ఇలా పొగడటాల ఫలితాలు మోడీకి - బీజేపీకి ఎలాంటి ప్రతిఫలాలను ఇవ్వబోతున్నాయనేది వేచిచూడాలి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News