రాష్ట్రాల‌పై మండి.. ఇక నేరుగా కేంద్రమే ఇస్తుంది!

Update: 2022-03-07 07:51 GMT
త‌మ ప్ర‌జ‌ల కోసం ఆ ప‌థ‌కాలు తెచ్చాం.. ఈ నిధులు ఇస్తున్నాం.. అంటూ గొప్ప‌గా చెప్పుకునే రాష్ట్ర ప్ర‌భుత్వాల పెత్త‌నానికి గండి కొట్టే ప్ర‌య‌త్నానికి కేంద్ర స‌ర్కారు పూనుకుంది. ఇప్ప‌టివ‌ర‌కూ వివిధ ప‌థ‌కాల‌కు కేంద్రం నిధులు ఇస్తున్నా..  ఆ ఘ‌న‌త మొత్తం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కే వెళ్తుంద‌ని భావించిన కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. అందుకే తాము అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌కు సంబంధించి నిధుల‌ను నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాల్లోనే జ‌మ చేయాలని నిర్ణ‌యించింది. ఏప్రిల్ ఒక‌టి నుంచి ఈ కొత్త విధానం అమ‌ల్లోకి రానుంది.

పోరాడి సాధించుకున్న తెలంగాణ‌లో అద్భుత ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం చెబుతోంది. కేంద్రం స‌హ‌కారం లేకున్నా ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి చేకూరుస్తున్నామ‌ని పేర్కొంటుంది. ఈ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్న బీజేపీ నేతలు రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌కు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తుంద‌ని అంటున్నారు. కొన్ని కార్య‌క్ర‌మాల కోసం ఏకంగా 80 నుంచి 90 శాతం నిధులు విడుద‌ల చేస్తోంద‌ని వాళ్లు చెబుతున్నారు. కానీ ఈ విష‌యాల‌ను దాచి పెట్టి.. ప‌థ‌కాల ఘ‌న‌త మొత్తాన్ని కేసీఆర్ అండ్ కో క్రెడిట్లో వేసుకుంటున్నార‌ని మండిప‌డుతున్నారు. ఉపాధి హామీ, వైకుంఠ ధామాల నిర్మాణం కోసం కేంద్రం ఇస్తున్న నిధుల‌ను దారి మ‌ళ్లిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ప‌థ‌కాల్లో కేంద్రం ముద్ర క‌నిపించేలా ల‌బ్ధిదారుల‌కు ఆ విష‌యం నేరుగా అర్థ‌మ‌య్యేలా బీజేపీ స‌ర్కారు ఈ నిర్ణ‌యం తీసుకుంది. నేరుగా వివిధ ప‌థ‌కాల్లో ల‌బ్ధిదారులైన ప్ర‌జ‌ల‌కు నేరుగా వాళ్ల ఖాతాల్లోనే కేంద్ర నిధులు జ‌మ చేయాల‌ని నిర్ణ‌యించింది. సెంట్ర‌ల్లీ స్పాన్స‌ర్డ్ స్కీమ్స్, సెంట్ర‌ల్ సెక్టార్ స్కీమ్స్ అని రెండు ర‌కాలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని ప‌థ‌కాల‌కు సంబంధించి నిధుల‌ను నేరుగా ల‌బ్ధిదారుల‌కు పంపించాల‌ని ఆలోచిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది.

ఇది అమ‌లైతే.. తెలంగాణ స‌హా ఇత‌ర రాష్ట్రాల పెత్తనానికి దెబ్బ పడుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌, ఉపాధి హామీ ప‌థ‌కం, ప్ర‌ధాన మంత్రి స‌మ్మాన్ నిధి, స్కాల‌ర్‌షిప్స్, ఎల్పీజీ గ్యాస్‌, ముద్ర యోజ‌న లాంటి ప‌థ‌కాల్లో రాష్ట్రాల అధికారం త‌గ్గి కేంద్రం పెత్త‌నం పెరుగుతుంద‌ని అంటున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేసే ప‌థ‌కాల‌ను క్షేత్ర‌స్థాయికి తీసుకెళ్లాల్సింది రాష్ట్ర ప్ర‌భుత్వాలే. కానీ కేంద్రం ఇచ్చిన నిధుల‌కు కొంత జ‌త చేసి మొత్తం రాష్ట్రమే ఇస్తుంద‌ని బీజేపీయేత‌ర రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు ప్ర‌చారం చేసుకుంటున్నాయ‌ని బీజేపీ ఆరోపిస్తుంది. మ‌రోవైపు వివిధ ప‌థ‌కాల‌కు కేంద్రం స‌కాలంలో నిధులు మంజూరు చేసినా.. రాష్ట్ర వాటా ఆల‌స్యం కావ‌డంతో ఆ ప్ర‌యోజ‌నాలు ప్ర‌జ‌ల‌కు అంద‌డం లేద‌ని తెలిసింది. అంతే కాకుండా కేంద్ర ఇస్తున్న నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నాయ‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఉపాధి హామీ నిధుల‌తో తెలంగాణ‌లో హ‌రిత హారం,

వైకుంఠ ధామాలు, ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి, రైతు వేదిక‌లు, గ్రామ పంచాయ‌తీ భ‌వనాల నిర్మాణాల్లాంటివి చేస్తున్నారనే విమ‌ర్శ‌లున్నాయి. అందుకే కేంద్రం నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాల్లోకే డ‌బ్బులు జ‌మ చేస్తే ఇలాంటిదేమీ ఉండ‌దు. అప్పుడు కేంద్రంలోని ప్ర‌భుత్వానికి గుర్తింపు వ‌స్తుంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News