ప‌వ‌న్ కోసం బీజేపీ ఎత్తుగ‌డ అదిరిపోలేదా?

Update: 2016-09-02 07:35 GMT
సినీనటుడు - జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విషయంలో స్పందించకుండా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్రంలోని నేతల నోటికి తాళం వేసిందని అంటున్నారు. తిరుప‌తి బహిరంగ సభలో ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి మాట్లాడిన పవన్ భాజపా నేతలు - కేంద్రప్రభుత్వంపై పలుమార్లు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే, పవన్ ఆరోపణలు - విమర్శలపై కమలం పార్టీ నేతలు ఎవరూ ఎదురుదాడికి దిగవద్దని, ఘాటుగా స్పందించవద్దని పార్టీ జాతీయ నాయకత్వం నుండి సూచనలు వచ్చినట్లు సమాచారం. 9వ తేదీన కాకినాడలో మరో బహిరంగ సభ నిర్వహిస్తానని పవన్ చేసిన ప్రకటనను జాతీయ నాయకత్వం గుర్తుచేసినట్లు తెలిసింది. ఆ స‌భ‌ వరకూ ఎవరు కూడా పవన్‌ పై గట్టిగా మాట్లాడవద్దని - ఆయన చేసిన ఆరోపణలకు - విమర్శలకు సమాధానం చెప్పవద్దని జాతీయ నాయకత్వం స్పష్టమైన సూచన చేసినందు వల్లే రాష్ట్ర నేతలెవరూ స్పందించడం లేదని అంటున్నారు. అప్ప‌టివ‌ర‌కు పవన్ ధోరణిలో ఎటువంటి మార్పు రాకపోతే అప్పుడే ఏమి చేయాలో నిర్ణయించుకోవచ్చని రాష్ట్ర నేతలు కూడా నిర్ణయించుకున్నారు.

ఇదిలావుండగా, రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన అంశంపై ఇటీవల తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించిన పవన్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభు త్వంపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. సార్వ‌త్రిక ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ మాట తప్పుతున్నట్లుగా పవన్ ఆరోపించారు. ప్రధాని గనుక మాట తప్పితే కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తానంటూ తీవ్ర హెచ్చరికలు కూడా చేసారు. తనకు ప్రత్యేకంగా ఏ వ్యక్తితో అనుబంధం కానీ లేదా ఏ అజెండా కానీ లేదన్నారు. ప్రజల ప్రయోజనమే తన అజెండా అంటూ పవన్ స్పష్టంగా ప్రకటించారు. ప్రజల కోసం తాను ప్రధానిని సైతం నిలదీయటానికి వెనుకాడనని చెప్పారు. అదే ఊపులో కేంద్రంమంత్రి వెంకయ్యనాయడు - అరుణ్‌ జైట్లీ లను కూడా విమర్శించారు. పదవులను పట్టుకుని వేలాడవద్దని పార్టీ రాజకీయాలకన్నా దేశ ప్రయోజనాలే ఎక్కువంటూ వెంకయ్యపై విరుచుకుపడ్డారు. అంటే తన స్వార్ధం కోసం - పదవుల కోసం వెంకయ్య రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేకహోదాను కూడా పక్కనబెట్టారని ఆరోపించారు. పనిలో పనిగా తుమ్మితే ఊడిపోయి మంత్రి పదవిని వెంటనే రాజినామా చేయాలంటూ అశోక్‌ గజపతి రాజును డిమాండ్ చేసారు.

ఈ ప్ర‌క‌ట‌న‌ల‌తో ఇటు భాజపా నేతలకు - అటు తెలుగుదేశం పార్టీ నేతలకు బాగా మండింది. టీడీపీ ఎంపీలు - నేతలు పవన్‌ పై ఘాటుగానే స్పందిస్తున్నారు. ఎంపీలు అవంతి శ్రీనావాస్ - జేసీ దివాకర్‌ రెడ్డిలు పవన్ ఆరోపణలు - విమర్శలపై గట్టిగానే స్పందించారు. అయితే, ఇదే విషయమై మాట్లాడుతున్న భాజపా నేతలు మాత్రం, అసలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోవటానికి కారణమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయడంటూ ధ్వజమెత్తుతున్నారు. ప్రత్యేకహోదా రాష్ట్రానికి అవసరం లేదన్నట్లుగా ఇంత కాలం మాట్లాడిన చంద్రబాబు విషయాన్ని కమలనాధులు ఎత్తి చూపుతున్నారు. ప్రజల మనోభావాలు - ప్రతిపక్షాల ఆందోళనలతో ఒత్తిడికి లొంగిన చంద్రబాబు ఇపుడు ప్రత్యేకహోదా అంశం గురించి మాట్లాడుతున్నట్లు కమలనాధులు చెబుతున్నారు. ప్రత్యేకహోదాపై పవన్‌ కు చిత్తశుద్ది ఉంటే తప్పు పట్టాల్సింది చంద్రబాబును మాత్రమేనంటున్నారు. తడవకొక మాట మాట్లాడిన ముఖ్యమంత్రి అంశానికి అసలు ప్రాధాన్యత లేకుండా చేసినట్లు భాజపా నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినా పవన్‌ కు తెలియకపోవటం పట్ల ఆశ్చర్యపోతున్నారు.

తప్పు పట్టాల్సిన చంద్రబాబును వదిలిపెట్టి కేంద్రప్రభుత్వాన్ని - వెంకయ్యనాయడును అనాల్సిన అవసరం పవన్‌ కు ఏమిటంటూ మండిపడుతున్నారు. అనవసరంగా పవన్‌ కు మొదట్లో తమ జాతీయ స్ధాయి నేతలు విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వటంతోనే ఇపుడు పవన్ ఈ స్ధాయిలో మాట్లాడుతున్నారని భాజపా రాష్ట్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 9వ తేదీన కాకినాడలో సభ నిర్వహిస్తానని పవన్ చెప్పాడు కాబట్టి అప్పటి వరకూ వేచి చూడాలంటూ తమ జాతీయ నాయకత్వం చేసిన సూచనకు కట్టుబడినట్లుగా నేతలు చెప్తున్నారు. మొన్నటి సభలో కేంద్రానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలన్నీ ప్రధాని కార్యాలయానికి చేరినట్లు కూడా చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంపైన గానీ పవన్ పైన గానీ ఏమి మాట్లాడాలన్నా తమ జాతీయ నాయకత్వం తమ నోళ్ళను కట్టేస్తున్నట్లు రాష్ట్ర నేతలు వాపోతున్నారు. చేసిన పనులను - ఇచ్చిన నిధుల విషయాన్ని కూడా స్పష్టంగా తాము చెప్పుకోలేకపోతున్నట్లు కమలం నేతలు అంటున్నారు.
Tags:    

Similar News