అసద్ ను అరెస్ట్ చేయాలంటున్నారు

Update: 2016-07-04 04:40 GMT
దూకుడు మాటలు చెప్పే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇరుకున పడ్డారా?ఐఎస్ ను తీవ్రంగా వ్యతిరేకించేలా మాట్లాడుతున్న ఆయన.. మరోవైపు ఉగ్రవాద కార్యకలాపాలతో అరెస్ట్ అయిన వారికి సాయంగా న్యాయ సహాయం చేస్తానని వ్యాఖ్యానించటంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.ఓపక్క పక్కా ఆధారాలతో ఐఎస్ సానుభూతిపరులన్న విషయం బయటపడినా.. అసద్ న్యాయ సాయం మాట చెప్పటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఉగ్రవాదులుగా ఆరోపణలుగా ఎదుర్కొంటున్న వారిని తాము ఆదుకుంటామని చెప్పటంపై ప్రశ్నిస్తున్న వారంతా.. ఆయన్ను అరెస్ట్ చేయాలని.. మజ్లిస్ పార్టీని బ్యాన్ చేయాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొస్తున్నారు. తాజాగా బీజేపీ నేతలు అసద్ మీద తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేయటమే కాదు.. పెద్ద ఎత్తున మత కల్లోలాలకు తెర తీసేలా వ్యూహాన్ని రచించటం.. జాతీయదర్యాప్తు సంస్థ ఈ కుట్రకు బ్రేకులు వేయటంతో సరిపోయింది కానీ.. లేదంటే ఈ పాటికి తీవ్ర విషాదంలో కూరుకుపోవాల్సిన పరిస్థితిగా చెప్పాలి.

అలాంటిది ఉగ్రవాద ఆరోపణలతో అరెస్ట్ అయిన వారికి సాయం చేస్తామని అసద్ అన్నా.. చట్టపరమైన చర్యలు తీసుకోకపోవటం ఏమిటంటూ తెలంగాణ బీజేపీ అధినేత లక్ష్మణ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ మజ్లిస్ అధినేతలకు మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సర్కారు ఇప్పటివరకూ స్పందించకపోవటం ఏమిటన్న ప్రశ్నను లక్ష్మణ్ సంధిస్తున్నారు.

హైదరాబాద్ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని.. పాతబస్తీలో మరిన్ని తనిఖీలు చేపట్టాలని డిమాండ్ ను లక్ష్మణ్ తెర మీదకు తెస్తే.. ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ఉగ్రవాదులకు అసదుద్దీన్ సహకరిస్తున్నారని..ఆయనపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.ఉగ్రవాదాన్ని అణిచివేయాలని ప్రపంచం మొత్తం ప్రయత్నిస్తుంటే.. తెలంగాణలో మాత్రం మజ్లిస్ మాత్రం వారిని ప్రోత్సహిస్తూ పోషిస్తుందంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాత బస్తీని జల్లెడ పడితే.. మరికొందరు ఉగ్రవాదులు దొరికే అవకాశం ఉందన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అసద్ వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు మాత్రమే కాదు.. ఢిల్లీ స్థాయిలోని నేతలు సైతం అసద్ ను టార్గెట్ చేయటం గమనార్హం.

అంతేకాదు.. అసద్ వ్యాఖ్యలపై జేడీయూ నేతలు సైతం తప్పు పడుతున్నారు.ఓవైసీ వ్యాఖ్యలు ఉగ్రవాదులకు మద్దతు పలికేలా ఉన్నాయని ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడు అనిల్ కుమార్ అభిప్రాయపడితే.. అసద్ ను జైల్లో పెట్టాలంటూ జేడీయూ అధికార ప్రతినిధి అజయ్ ఆలోక్ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. చూస్తుంటే.. తాజాగా పట్టుబడిన ఉగ్రవాదులను ఉద్దేశించి అసద్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను డిఫెన్స్ లో నెట్టాయన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేయటం గమనార్హం.
Tags:    

Similar News