టీడీపీ కోసం ప‌నిచేస్తున్న‌ బీజేపీ కోవ‌ర్టులు

Update: 2016-12-18 07:39 GMT
ఏపీలో బ‌ల‌ప‌డాలని భావిస్తున్న బీజేపీకి ఆ పార్టీ నేత‌లే అడ్డుపుల్ల‌గా మారారా?  సొంత పార్టీ కంటే మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారా?  అంటే అవున‌నే స‌మాధానం పార్టీ నేత‌ల నుంచి వ‌స్తోంది. బీజేపీలో చేరాలనుకున్న చాలామంది ఇతర పార్టీల నేతలు రాష్ట్ర నాయకత్వ వైఖరిని చూసి వెనక్కివెళ్లిపోతే, మరికొందరు ఉత్సాహవంతులైన నేతల పేర్లను తెదేపా మేలుకోరే కొందరు బీజేపీ  నేతలు టీడీపీకి ఉప్పందించటంతో, వారిని సైకిల పార్టీ నాయకత్వం తమ పార్టీలో చేర్చుకుందని క‌మ‌ళ‌నాథులు వివరిస్తున్నారు. ఇటీవల తెదేపాలో చేరిన మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ - అంతకుముందు మాజీ ఎమ్మెల్యే మురుగుడు హన్మంతరావు తొలుత బీజేపీ అగ్రనేతలతో చర్చించారని, ఆ విషయాన్ని టీడీపీకి సామాజికపరంగా మానసిక మద్దతుదారులయిన తమ పార్టీ సీనియర్లే ఉప్పందించటంతో, తెదేపా వారిని తనవైపు మళ్లించుకుందని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. తమ పార్టీలో తెదేపా కోవర్టులు చాలామంది ఉన్నారని, పార్టీ ఈ దుస్థితికి చేరడానికి వారి పుణ్యమే కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు జాతీయ అధ్యక్షుడి అమిత్ షా ఆదేశాలు సైతం స‌రిగా అమ‌లు కావ‌డం లేద‌ని బీజేపీ అభిమానులు వాపోతున్నారు. అమిత్ షా ఆదేశంతో జాయినింగ్ కమిటీ వేసినా దానిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పైగా నిర్వీర్యం చేశారని మండిప‌డుతున్నారు. కొత్తగా చేరాలనుకుంటున్న వారికి సమయం ఇవ్వకపోవడం, వారి పేర్లు ముందుగా తెదేపాకు లీక్ చేయ‌డంతో వారంతా ఆ పార్టీలో చేరుతున్నార‌ని వాపోతున్నారు. తాజాగా అమిత్ షా తాడేపల్లిగూడెం సభకు ఉత్తరాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో వచ్చేందుకు సిద్ధమవగా, వారిని ఓ సీనియర్ నేత వారించారని, సభకు పదిరోజుల ముందు పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సభ పెడితే సక్సెస్ అవుతుందా?అని నేతల ముందే అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే నేతలు మరో కేంద్రమంత్రికి రాష్ట్రంలో ఎక్కడ సన్మానాలు జరిగినా తామే స్వయంగా ఫోన్లు చేసిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రానికి ఏ ఇతర నాయకులు వచ్చినా ఒక వర్గానికి చెందిన నేతలు ఇష్టపడటం లేదని, జనవరిలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ ప‌ర్య‌ట‌న‌లోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు.

తాడేపల్లిగూడెంలో అమిత్‌ షా సభకు రాష్ట్ర నాయకత్వం నయాపైసా ఇవ్వకపోయినా - నిధుల సమీకరణకు సహకరించకపోయినా జిల్లా నేతలే సమకూర్చుకున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఢిల్లీ నేతలను కూడా మేనేజ్ చేస్తున్నారని, వారికి తెదేపాకు చెందిన ఓ కేంద్రమంత్రి ఈ విషయంలో మార్గదర్శిగా ఉన్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ప్రస్తుత రాష్ట్ర ఇంచార్జి వ్యవహారశైలి రాష్ట్రంలో పార్టీ విస్తరణకు అనుకూలంగా లేదని, ఆయన కూడా ఒక వర్గం చట్రంలో ఇరుక్కున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విజయవాడకు వచ్చిన ప్రభుత్వ-పార్టీ ప్రముఖులను పార్టీ ఆఫీసుకు రానీయకుండా హోటళ్లకు, అటునుంచి అటు తెదేపా నేతల వద్దకు తీసుకువెళుతున్నారని, ఈ విషయంలో తమ పార్టీకి చెందిన ఒక రాష్ట్ర మంత్రే అత్యుత్సాహం చూపుతుంటే పార్టీ ఇక ఏం పురోగమిస్తుందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News