ఉచిత పథకాల విషయంలో బీజేపీ అభిప్రాయం ఇదే!

Update: 2022-10-27 14:30 GMT
ఎన్నికల సమయంలో ఓటర్లకు రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉచిత పథకాలు ఓటర్లను ప్రలోభపెట్టడానికేనని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రూపంలో తన అభిప్రాయాన్ని తెలియజేసింది.

ఉచిత పథకాలు, సంక్షేమానికి మధ్య తేడా ఉందని బీజేపీ పేర్కొంది. సంక్షేమం సమ్మిళిత వృద్ధికేనని కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో తెలిపింది. ఎన్నికల నియమావళిలో మార్పుల ప్రతిపాదనకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఎన్నికల సంఘం కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ.. కేంద్ర ఎన్నికల సంఘానికి తన వైఖరిని లేఖ రూపంలో వెల్లడించింది.

ఉచితాలు ఓటర్లను ఆకర్షించడానికి చేసేవేనని బీజేపీ అభిప్రాయపడింది. అదే సంక్షేమం మాత్రం సమ్మిళిత వృద్ధి కోసం తీసుకునే విధానపరమైన నిర్ణయమని బీజేపీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఓటరు సాధికారతకే ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.

ఓటర్ల శక్తిసామర్థ్యాలను పెంచడం, ఆర్థికంగా వృద్ధి చెందేందుకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించడంపై దృష్టి సారించాలని బీజేపీ తన అభిప్రాయాన్ని వెల్లడించడం విశేషం.  

ఎన్నికల్లో ఇచ్చే హామీలను నెరవేర్చేందుకు ఆర్థికంగా ఎలా సాధ్యమనే విషయాన్ని పార్టీలు తెలియజేయాలనే కేంద్ర ఎన్నిక సంఘం ఆలోచనపైనా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని లేఖలో బీజేపీ పేర్కొంది. ఉచిత పథకాలపై ప్రధాని నరేంద్ర మోదీ వైఖరి కూడా ఇదేనని ఈసీకి రాసిన లేఖలో వివరించింది.

కాగా ఉచితాలు, సంక్షేమ పథకాలపై రాజకీయ పార్టీల వైఖరి తెలియజేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఇప్పటికే కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీలు అభిప్రాయాలు వెల్లడించాలని సూచించింది. ఇందుకు సంబంధించిన గడువు కూడా అక్టోబర్‌ 19కే ముగిసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News