103 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతు

Update: 2018-12-14 11:17 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ తర్వాత అత్యధిక స్థానాల్లో పోటీ చేసిన పార్టీ బీజేపీనే.. టీఆర్ ఎస్ మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా.. బీజేపీ 118 స్థానాల్లో పోటీచేసింది. కాంగ్రెస్ 95 సీట్లలో మాత్రమే నిలుచుంది. ఎంతో ఆశించిన ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన బీజేపీ బొక్కబోర్లా పడింది. కేవలం ఒక్కటంటే ఒక్కస్థానంలోనే గెలిచింది. ఎంతో ఘోరంగా ఓడిపోయిందంటే 118 స్థానాల్లో 103మంది డిపాజిట్లు కోల్పోయింది. 15 స్థానాల్లోనే డిపాజిట్ దక్కించుకుంది. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ - శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి  - సీనియర్ నేతలు ప్రభాకర్ - చింతల లాంటి హేమాహేమీలు ఓడిపోయి అవమానం భారాన్ని మూటగట్టుకుంది.

బీజేపీ గెలుపుకోసం చాలా ప్రయత్నాలు చేసింది. ప్రధాని మోడీ - బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు - కేంద్రమంత్రులు బీజేపీ కోసం ప్రచారం చేశారు.  అయినా ఆ పార్టీ ఒక్క సీటు తోనే సరిపెట్టుకోవడం అందరినీ నిరాశపరిచింది.

2014లో ఐదు సీట్లు గెలిచిన బీజేపీ తమకు సీట్లు తక్కువగా రావడానికి టీడీపీ కారణమని ఆరోపించింది.  కానీ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసి అంతకంటే దిగజారడంతో పార్టీ పెద్దలు ఏం సమాధానం చెప్పలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బీజేపీ సీనియర్ నేత వెంకయ్య వల్లే తాము ఎదగలేకపోతున్నామని అప్పట్లో రాష్ట్ర నేతలు ఫిర్యాదు చేశారట.. కానీ ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతిగా రాజకీయాల నుంచి వైదొలిగి రెస్ట్ తీసుకుంటున్నారు. అయినా తెలంగాణ బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో సాధించింది శూన్యంగా మారింది.  విశేషం ఏంటంటే పార్టీ నుంచి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను వెళ్లగొట్టడానికి బీజేపీ పెద్దలు శతవిధాల ప్రయత్నించారు. కానీ ఎవ్వరి సహకారం లేకుండా ఆయన ఒక్కడే గెలిచి నిలుచోవడం గమనార్హం.

రాజాసింగ్ గోషామహల్ లో హిందుత్వ ఎజెండాతోనే ముందుకెల్లారు. మజ్లిస్ ను టార్గెట్ చేసి పోరాడారు. దీంతో గోషామహల్ లో హిందువుల ఓట్లు గంపగుత్తగా రాజాసింగ్ కు పడ్డాయి.  నాలుగున్నరేళ్లుగా జనంలో లేకుండా చివర్లో హల్ చల్ చేసిన బీజేపీ నేతలు మూల్యం చెల్లించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీని బలోపేతం చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషిస్తున్నారు.
    

Tags:    

Similar News