రాహుల్ గాంధీ.. ఎల‌క్ష‌న్ హిందువు!

Update: 2018-02-12 17:30 GMT
సాధార‌ణంగా సినిమా వాళ్ల‌కి సెంటిమెంట్లు ఎక్కువుంటాయి. కొన్ని కాంబినేష‌న్ల‌కి వ‌రుస ఫ్లాప్‌లు ప‌డినా, లేదా ఒక ప‌ర్స‌న్ న‌టించిన సినిమాలు మ‌ళ్లీ మ‌ళ్లీ ఫెయిల‌యినా వాటికి మ‌ళ్లీ ఛాన్సులు త‌క్కువ‌. అయితే, రాజ‌కీయాలు వేరు. బ‌లం, పార్టీ, డ‌బ్బు ఏదో ఒక‌టి ఉంటే చాలు... ఫ్లాపుల‌తో సంబంధ‌మే ఉండ‌దు. ఇపుడు ఆ ఫెయిల్ సెంటిమెంట్ హీరో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ.

ఆయ‌న ప్ర‌చారం చేసిన ఏ ఎన్నిక కూడా ఇంత‌వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేలేదు. దీనిపై ఇప్ప‌టికే నెటిజ‌న్లు చాలా సెటైర్లు వేశారు. కొంద‌రు సొంత పార్టీ నేత‌లు కూడా దీనిపై వ్యాఖ్య‌లు చేసి చీవాట్లు తిన్నారు. అయితే తాజాగా బీజేపీ అధికారంగా ప్రెస్ మీట్ల‌లో ఈ సెంటిమెంట్‌ను వాడేసింది. అంతేకాదు, రాహుల్ కి కొన్ని కొత్త బిరుదుల‌ను కూడా ఇచ్చింది.  క‌ర్ణాట‌క‌లో ఈ ఏడాది ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే క‌దా. ఇప్ప‌టికే అక్క‌డ ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైపోయింది. మోడీ బ్యాచ్ కాస్త ముందుగా మొద‌లుపెట్టినా కాంగ్రెస్ కూడా ఇపుడు అందుకుంది. అందులో భాగంగా రాహుల్ గాంధీ క‌ర్ణాట‌క‌లో నాలుగు  రోజుల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. దీనిపై బీజేపీ నేత‌లు మాట్లాడారు.

*రాహుల్ క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌నను స్వాగ‌తిస్తున్నామ‌ని,  ఎందుకంటే ఆయ‌నే మా గెలుపు సార‌థి. రాహుల్ కాంగ్రెస్ కు ప్ర‌చారం చేశారంటే.. అక్క‌డ మా గెలుపు ఖాయం అయిపోయినట్లే * అని బీజేపీ నేత ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ వ్యాఖ్యానించారు. త‌న విధానాల‌తో సూడో సెక్యుల‌రిజాన్ని దేశానికి ప‌రిచ‌యం చేసిన కాంగ్రెస్ తాజాగా సూడో హిందుయిజాన్ని కూడా ప‌రిచ‌యం చేస్తుంద‌ని ఆయ‌న పార్టీపై కూడా సెటైర్ వేశారు. భ‌క్తి ఎవ‌రిదో, ఎన్నిక‌ల జిమ్మిక్ ఎవ‌రిదో ప్ర‌జ‌ల‌కు తెలియ‌దా? అంటే ప్ర‌కాశ్ చ‌మ‌త్క‌రించారు.

అయితే ఈ సంద‌ర్భంగా య‌డ్యూర‌ప్ప రాహుల్‌కి చ‌క్క‌టి బిరుదిచ్చారు.  ఆ బిరుదు ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ ఇవ్వ‌లేదు. అస‌లు ఆ మాటే ఎవ‌రూ వాడ‌లేదు. సాధార‌ణంగా ఎన్నిక‌లు వ‌స్తే హిందు నేత‌లు ముస్లింల‌ను క‌లిసి టోపీ పెట్ట‌డం మామూలే. కానీ గుజ‌రాత్ ఎన్నిక‌ల నుంచి రాహుల్ కొత్త సంప్ర‌దాయం మొద‌లుపెట్టారు. ఎన్నికలు వ‌స్తే రాహుల్ గుళ్ల‌కు వెళ్తున్నాడు. అందుకే ఆయ‌నను *ఎల‌క్ష‌న్ హిందు*  అని పిల‌వ‌డం స‌బ‌బ‌ని య‌డ్యూర‌ప్ప వ్యాఖ్యానించారు. మొత్తానికి క‌ర్ణాట‌క‌లో య‌డ్యూరప్ప క‌నిపెట్టిన ఈ ప‌దం ఇపుడ‌క్క‌డ వైర‌ల్ అట‌. బానే ఉంది బిరుదు మాత్రం.


Tags:    

Similar News