బీజేపీ స‌ర్కారు రాష్ట్ర‌ప‌తిని అవ‌మానించేసింది!

Update: 2017-06-25 04:18 GMT
దేశానికి నూత‌న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు ఎన్నిక‌ల షెడ్యూల్ అయితే విడుద‌లైంది గానీ... ఇంకా ఎన్నిక జ‌ర‌గ‌లేదు. ఐదేళ్ల నుంచి దేశ ప్ర‌థ‌మ పౌరుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ద‌వి నుంచి ఇంకా దిగిపోలేదు. ఇంకా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ ను ఖాళీ కూడా చేయ‌లేదు.  ఇంకా ఓ నెల పాటు ఆయ‌న రాష్ట్ర‌ప‌తిగానే కొన‌సాగుతారు. అంటే ఇప్పుడు దేశానికి ప్ర‌థ‌మ పౌరుడు ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీనే. మొన్న‌టిదాకా రాష్ట్ర‌ప‌తి హోదాలో ప్ర‌ణ‌బ్‌ కు ఇచ్చిన గౌర‌వ మర్యాద‌ల‌కు ఎలాంటి లోటూ లేదు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా కొన‌సాగిన ప్ర‌ణ‌బ్‌... కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హ‌యాంలోనే రాష్ట్ర‌ప‌తి అయ్యారు. ఆ త‌ర్వాత యూపీఏ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడుతూ గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో దేశ ప్ర‌జ‌లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారును గ‌ద్దెనెక్కించారు.

ప్ర‌జా బ‌లంతో ప్ర‌ధాన మంత్రి పీఠాన్ని అధిష్టించిన న‌రేంద్ర మోదీ... గ‌ర్వంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయినప్ప‌టికీ మోదీ గానీ, ఆయ‌న కేబినెట్ స‌హ‌చ‌రులు గానీ... ఏనాడూ ప్ర‌ణ‌బ్ ప‌ట్ల అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించలేదు. ప్రొటోకాల్ ప్ర‌కారం ప్ర‌ణ‌బ్‌ కు ఇవ్వాల్సిన మ‌ర్యాద‌లకు కూడా వారు కొద‌వేమీ చేయ‌లేదు. ఇదంతా గ‌తం... ఇప్పుడు కొత్త రాష్ట్ర‌ప‌తిగా బీజేపీ సీనియ‌ర్ నేత‌ - మొన్న‌టిదాకా బీహార్ గ‌వ‌ర్న‌ర్‌ గా వ్య‌వ‌హ‌రించిన రామ్‌ నాథ్ కోవింద్ దాదాపుగా ఎన్నికైపోయారు. ఎన్డీఏ అభ్య‌ర్థిగా కోవింద్‌ ను ఖ‌రారు చేసిన బీజేపీ ప్ర‌భుత్వం... ఆయ‌న‌ను గెలిపించుకునేందుకు ఇప్ప‌టికే ప‌క్కాగా కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించింది. వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో కోవింద్ విజ‌యం సాధించ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. అంటే భార‌త నూత‌న రాష్ట్ర‌ప‌తిగా మ‌రొక‌రు వ‌చ్చేస్తున్నార‌న్న మాట‌.

ఇదే భావ‌న బీజేపీ నేత‌ల్లో వ‌చ్చిందో, లేక అనుకోకుండా జ‌రిగిందో తెలియ‌దు గానీ... ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తిగా ఉన్న ప్ర‌ణ‌బ్‌ కు నిన్న తీర‌ని అవ‌మానం జ‌రిగింది. రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకుని సంప్ర‌దాయం ప్ర‌కారం ఏటా నిర్వ‌హిస్తున్నట్లుగానే రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ లో ఇఫ్తార్ విందును ప్ర‌ణ‌బ్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజ‌రుకావాల‌ని ప్ర‌ధాని మోదీ స‌హా ఆయ‌న కేబినెట్ స‌హ‌చ‌రుల‌కు - ఇత‌ర పార్టీల కీల‌క నేత‌ల‌కు ఆహ్వానాలు కూడా పంపారు. మూడు దేశాల ప‌ర్య‌ట‌నకు వెళ్లిన కార‌ణంగా శుక్ర‌వారం జ‌రిగిన ఈ విందుకు ప్ర‌ధాని మోదీ హాజ‌రుకాలేక‌పోయారు. అందుబాటులో ఉన్న ఇత‌ర పార్టీల నేత‌లు అంతా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ కు హాజ‌రై ప్ర‌ణ‌బ్ ఆహ్వానాన్ని మ‌న్నించారు. అయితే మోదీ కేబినెట్‌ లోని మంత్రులు మాత్రం ప్ర‌ణ‌బ్ ఆహ్వానాన్ని బుట్ట‌దాఖ‌లు చేస్తూ.. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వైపు క‌న్నెత్తి చూసిన పాపాన పోలేదు.

అనారోగ్య‌మో, ఏదేనీ వ్య‌క్తిగ‌త అత్య‌వ‌స‌ర ప‌నుల నిమిత్త‌మో అయితే ఒక‌రిద్ద‌రు మంత్రులు గైర్హాజ‌ర‌వుతారు గానీ... ఏదో అంతా క‌లిసి మాట్లాడుకున్న‌ట్లుగా మంత్రుల్లో ఒక్క‌రు కూడా ఆ ద‌రిదాపుల్లోకి పోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర‌ప‌తి ఇస్తున్న ఈ విందుకు కేంద్ర మంత్రులు త‌ప్ప‌క హాజ‌ర‌వుతార‌ని భావించిన రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసింది. అయితే మంత్రులెవ్వ‌రూ రాక‌పోవ‌డంతో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ అధికారులు ఆశ్చ‌ర్య‌పోయారు. రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌ణ‌బ్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఈ త‌ర‌హాలో ఆయ‌న‌ను అవ‌మానించిన ఘ‌ట‌న ఇప్ప‌టిదాకా లేదని, రాష్ట్ర‌ప‌తి హోదాలో ప్ర‌ణ‌బ్ పంపిన ఆహ్వానాల‌ను ప‌క్క‌న‌ప‌డేసిన కేంద్ర మంత్రులు ఆయ‌న‌ను ఘోరంగా అవ‌మానించార‌ని వారు వాపోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News