యోగి వ‌ల్లే ఓట‌మి..బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌నం

Update: 2018-06-02 04:42 GMT
బీజేపీలో కుంప‌ట్లు మొద‌ల‌వుతున్నాయి. ఉప ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మి ద్వారా ఇవి అక‌స్మాత్తుగా తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. కీల‌క రాష్ట్రమైన యూపీలో ఇది బ‌హిరంగంగానే సాగుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఉత్తరప్రదేశ్‌ లో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ బీజేపీ ఓటమి పాలవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఆయన బహిరంగంగా చేసిన విమర్శలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ముఖ్యమంత్రిపై సామాజిక మాధ్యమంలో హర్దోరు జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యే శ్యామ్‌ ప్రకాశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వ్యంగ్యాస్త్రాలు పోస్టు చేశారు. 'ప్రధాన మంత్రి విజ్ఞాపన మేరకు రాజకీయ నాయకుడిగా మారిన పూజారి అధికారాన్ని చేపట్టారు. కానీ, గతేడాది యూపీ ఇచ్చిన భారీ ప్రజా తీర్పును ఆయన తునాతునకలు చేశారు' అని పేర్కొన్నారు.

అయితే స‌ద‌రు బీజేపీ ఎమ్మెల్యే ప్ర‌ధాని మోడీని మెచ్చుకుంటూ...సీఎం యోగిపై మాత్ర‌మే విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. `ప్రధాని మోడీ పేరుతో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ, ప్రజల ఆశలకనుగుణంగా పనిచేయలేదు. ప్రజలతోపాటు - శాసనసభ్యులు కూడా దుఃఖంతో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ నిస్సహాయంగా ఉండిపోయారు' అని ఆరోపించారు. 'ఇది నా అభిప్రాయం. అవినీతి బాగా పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న దాని కంటే ఇప్పుడు అవినీతి పెరిగిపోయింది. ఈ ఓటమికి అదే కారణం. దీనిపై ముఖ్యమంత్రి  దృష్టిపెట్టాలి. అవినీతి నిర్మూలనకు గట్టి కృషి చేయాలి. ఆ పని చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ఇదే ఫలితాలు తప్పవు` అంటూ హెచ్చ‌రించారు. ఇదిలాఉండ‌గా...మరో ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ కూడా యూపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఉప ఎన్నికల్లో ఓటమికి మంత్రులే కారణన్నారు. అవినీతి అధికారులు రాష్ట్రంలోని ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. 2019 ఎన్నికలు వస్తోన్న తరుణంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి మంచి సందేశమని ఆయన తెలప‌డం గ‌మ‌నార్హం.

కాగా, తాజాగా వెలువ‌డిన లోక్‌ స‌భ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల్లో బీజేపీ ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. 2014 తర్వాత యూపీ నుంచి లోక్‌ సభకు తొలి ముస్లిం కైరానా(ఉత్తరప్రదేశ్‌) లోక్‌సభ స్థానాన్ని విపక్షాలు కైవసం చేసుకున్నాయి. దాదాపు 55 వేల ఓట్ల మెజార్టీతో రాష్ట్రీయ లోక్‌ దళ్‌(ఆర్ ఎల్డీ) అభ్యర్థి తబస్సుమ్‌ హసన్‌ తన సమీప ప్రత్యర్థి మగంకా సింగ్‌పై ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో తబస్సుమ్‌ హసన్‌ కు విపక్షాలు ఎస్పీ - బీఎస్పీ - కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.కైరానా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ హుకుమ్‌ సింగ్‌ ఫిబ్రవరిలో కన్నుమూశారు.. దీంతో ఆయన తనయ మృగంకా సింగ్‌ ను కైరానా నుంచి బీజేపీ బరిలో నిలిపింది. ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కైరానా ఒకటి. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున హుకుంసింగ్‌ విజయం సాధించారు. ఆయన మరణంతో ఎన్నిక జరుగగా బీజేపీ తరఫున హుకుం సింగ్‌ కుమార్తె బరిలో నిలిచారు. అయితే విపక్షాల ఐక్యత ముందు బీజేపీ ఎత్తులు పారలేదు. కైరానా ఉప ఎన్నికలో విజయం సాధించిన తబస్సుమ్‌ మాట్లాడుతూ.. ఈ విజయం కైరానా ప్రజలదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి రాష్ట్రంలో లేదని చెప్పడానికి ఈ ఫలితమే నిదర్శనమని అన్నారు. మహా కూటమిని నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా ఆమోదించారని తబుస్సమ్‌ హసన్‌ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News