ఆ ద‌ళిత ఎమ్మెల్యే బొద్దింక‌తో స‌మానం

Update: 2017-12-23 06:04 GMT
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ముల త‌ర్వాత కూడా ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో వేడి చల్లార‌టం లేదు. ఇన్నాళ్లు జాతీయ స్థాయి నేత‌లు విమ‌ర్శ‌లు చేసుకుంటే ఇప్పుడు ఇరుగుపొరుగు రాష్ర్టాల వారు ఈ జాబితాలోకి చేరారు. గుజరాత్‌ దళిత నేతగా ఉండి ఇటీవ‌లే ఎమ్మెల్యేగా ఎన్నికైన జిగేశ్‌ మెవానీపై బీజేపీ మధ్యప్రదేశ్‌ ఎంపీ చింతామణి మాల్వియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జిగేశ్‌ మెవానీ అపరిశుభ్రాన్ని తినే జంతువు అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేకెత్తిస్తున్నాయి.

గుజరాత్‌లో జరిగిన ఎన్నికల్లో జిగేశ్‌ మెవానీ వద్గామ్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై మెవానీ ఇటీవల విమర్శలు చేశారు. 'దేశ ప్రజలను మోసం చేసింది చాలు.. మీ వాగ్దానాలు వినీ వినీ మాకు బోర్‌ కొడుతోంది. ఇక మీరు హిమాలయాలకు వెళ్ళండి... రామమందిరం అక్కడ నిర్మించుకోండి...' అంటూ మెవానీ వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో జిగేశ్‌ ను తప్పుపడుతూ బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేశారు.  జిగేశ్‌ ను బొద్దింకతో పోల్చారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకే ప్రధానిని ఆయన విమర్శించారని ఆరోపించారు. దళిత నాయకుడు జిగేశ్‌ - పటిదార్‌ నాయకుడు హార్ధిక్‌ పటేల్‌ - ఓబీసీ నాయకుడు అల్పేశ్‌ ఠాకూర్‌లను ప్రస్తావిస్తూ.. `సంస్కృతి కోల్పోయిన మూడు మురికి జంతువులను రాహుల్‌ గాంధీ కొనుగోలు చేశారు` అంటూ విమర్శించారు. 'జిగేశ్‌ లాంటి వ్యక్తులు దేశానికి చేసిందేమీ లేదు. మురికి రాజకీయాలకు పాల్పడుతున్నారు. దళితుల కోసం ఆయన ఏమీ చేయలేదు సరికదా... సొంత ప్రయోజనాల కోసం దళితులను ఉపయోగించుకున్నాడు' అని విమర్శించారు. ఆయ‌న పక్కా స్వార్థ‌ప‌రుడ‌ని దుమ్మెత్తిపోశారు.

దేశాన్ని విభజించేందుకు కమ్యూనిస్టులకు ఆయన సహాయపడుతున్నాడని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. 'నువ్వు నిజంగా షెడ్యూల్డ్‌ కులాల తరగతికి చెందినవాడవైతే.. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడవాలి కానీ, కమ్యూనిస్టులతో కాదు' అన్నారు. ప్రధానిని విమర్శించే అర్హత ఆయనకు లేదనీ అన్నారు. తెలివితక్కువ గ్యాంగ్‌ మోడీ కార్యక్రమాలను అర్థం చేసుకోలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అరోపించారు. ఇదిలాఉండగా... కర్నాటక అసెంబ్లీకి 2018లో జరిగే ఎన్నికల్లో దళిత యువ నేత జిగేశ్‌ మెవానీ ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచార కార్యక్రమ రోడ్‌ మ్యాప్‌ ను ఖరారు చేసుకునేందుకు ఈ నెల 28న ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
Tags:    

Similar News