అమ‌రావ‌తి...దేశానికి రెండో రాజ‌ధాని!

Update: 2020-01-24 14:01 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిగా కేంద్రంగా రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్న సంగ‌తి తెలిసిందే. అధికార ప్ర‌తిప‌క్షాలు త‌మ ప‌ట్టును నిలుపుకొనేందుకు ఎత్తులు వేస్తున్నాయి. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని అధికార పార్టీ ప‌ట్టుమీద ఉంటే... ప‌రిపాల‌న రాజ‌ధానిని క‌ద‌ల‌నిచ్చేది లేద‌ని ప్ర‌తిపక్ష టీడీపీ ఎత్తులు వేస్తోంది. ఈ ప‌రంప‌ర‌లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ ఒక‌రు కీల‌క ప్రతిపాద‌న పెట్టారు. అమ‌రావ‌తిని రెండో రాజ‌ధానిగా చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

టీడీపీ త‌ర‌ఫున ఎంపీగా రాజ్య‌స‌భ‌లో అడుగుపెట్టి అనంత‌రం అనూహ్య రీతిలో బీజేపీలో చేరిన సీనియ‌ర్ నేత టీజీ వెంక‌టేశ్ తాజాగా ఈ ఆస‌క్తిక‌ర డిమాండ్ చేశారు. `ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి రాజ‌ధానిని మార్చాల‌ని బ‌లంగా నిర్ణ‌యం తీసుకుంటే...అమ‌రావ‌తి ప్రాంత రైతుల‌కు అన్యాయం చేయ‌వ‌ద్దు. ద‌క్షిణ భార‌త‌దేశంలో భార‌త ప్ర‌భుత్వ రెండో రాజ‌ధాని ఉండాల‌ని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్ చేసిన‌ సూచన‌ను అనుస‌రించి అమ‌రావ‌తిని రెండో రాజధాని చేయాలి. ఇందుకోసం ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీని సీఎం జ‌గ‌న్ ఒప్పించాలి`` అని టీజీ డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏపీ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని అభినందిస్తూనే..ఓ కీల‌క స‌ల‌హా కూడా ఇచ్చారు. `` గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ప్రారంభించిన ఏపీ సీఎం ఈ మేర‌కు విజ‌యం సాధించారు. అదే కోవ‌లో ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణలో భాగంగా క‌ర్నూలుతో పాటుగా విశాఖ‌ప‌ట్ట‌ణంలో కూడా హైకోర్ట్‌ బెంచ్ ఏర్పాటు చేయాలి. అసెంబ్లీ శీతాకాల మ‌రియు వేస‌వి కాల స‌మావేశాల‌ను క‌ర్నూలులో నిర్వ‌హించాల‌ని `` అని డిమాండ్ చేశారు. టీజీ డిమాండ్ల‌పై అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Tags:    

Similar News