నెహ్రూపై వరుణ్ ప్రశంసల వర్షం!

Update: 2016-09-03 05:02 GMT
చరిత్ర సృష్టించిన చరిత్రకారులు - కారణజన్ములు అని చెప్పవడేవారు, జీవితంలో ఎంతో కష్టపడి ఉన్నత శిఖరాలను అదిరోహించిన వారూ ఆయా శిఖరాలను అదిరోహించడానికి ఎన్నో శ్రమలకు ఓర్చి ఉంటారు. అయితే వారి వారసుల్లో ఈ విషయాలను గుర్తుపెట్టుకుని నడుచుకునేవారు కొందరైతే.. కేవలం గుర్తుపెట్టుకుని ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యేవారు మరికొందరు. వీటిలో ఆయన ఏ కోవకు వస్తాడనే సంగతి కాసేపు పక్కన పెడితే... తమ ముత్తాత గురించి తాజాగా స్పందించారు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ!

దేశ ప్రథమ ప్రధానమంత్రి - కాంగ్రెస్‌ నాయకుడు జవహర్‌ లాల్‌ నెహ్రూపై బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ ఉన్నట్టుండి భారీస్థాయిలో ప్రశంసల వర్షం కురిపించారు. నెహ్రూ విషయంగా... ఆయన ఒక రాజులాగా విలాసవంతమైన జీవితాన్ని గడిపారని చాలా మంది ప్రజలు అనుకుంటారు కాని.. వారందరికీ తెలియని విషయమేమిటంటే.. నెహ్రూ 15 ఏళ్లు జైలులోనే గడిపారు. అలా 15ఏళ్లపాటు జైల్లో గడిపితే దేశ ప్రథమ ప్రధాని పదవి వచ్చింది తప్ప... అందరూ అనుకుంటున్నట్లు, చెప్పుకుంటున్నట్లు ఆయన విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి కాదని వరుణ్‌ గాంధీ అన్నారు.

ఇదే సమయంలో భావజాల సిద్ధాంతాలపై కూడా వరుణ్ స్పందించారు. స్వాతంత్ర పోరాటకాలంలో నెహ్రూ - చిత్రంజన్ దాస్ లు భావజాలంపరంగా ఒకవైపు ఉంటే, లాలా లజపతిరాయ్ మరోవైపు నిలబడ్డారని, ఎటు వైపున్నా అప్పట్లో నాయకులను భావజాలాలు అనేవి ఉండేవని చెప్పారు. ఈ రోజుల్లో రాజకీయ నాయకులకు ఎవరికైనా భావజాల సిద్ధాంతాలు ఉన్నాయా? అలా ఉన్నాయని ఎవరైనా తమ గుండె లపై చేయివేసుకుని చెప్పగలరా? అని ప్రశ్నించారు. లక్నోలో జరిగిన ఓ యూత్‌ సదస్సులో ప్రసంగిస్తూ వరుణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఎవరైనా వచ్చి తనను జైలులో ఉంచి 15 ఏళ్ల తర్వాత ప్రధాని పదవి ఇస్తామంటే ఎవరైనా వెళ్తారా? ఎవరి సంగతేమో కానీ తాను మాత్రం.. "క్షమించండి, చాలా కష్టం" అని చెప్తామని అభిప్రాయపడ్డారు. దేశానికి విముక్తి సాధించడానికి నెహ్రూ తన కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారని, నేటి యువత ఆయన త్యాగాలను గుర్తించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
Tags:    

Similar News