శివ‌సేన‌కు షాక్‌..మోడీ అధికార ఎత్తుగ‌డ ఇది

Update: 2018-12-28 17:45 GMT
పేరుకే మిత్ర‌ప‌క్షం అయిన‌ప్ప‌టికీ...ఇటీవ‌లి కాలంలో భార‌తీయ జ‌నతాపార్టీకి వ‌రుస షాక్‌ లు ఇస్తున్న మ‌రాఠాల పార్టీ శివ‌సేనకు క‌మ‌ల‌నాథుల నుంచి ఊహించ‌ని షాక్ త‌గిలింది. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌మ‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్న శివ‌సేనుకు అదే రీతిలో త‌మ‌కు అవ‌కాశం దొర‌క‌గానే బీజేపీ దెబ్బ‌కొట్టింది. మ‌హారాష్ట్రలో శివ‌సేన తీవ్రంగా వ్య‌తిరేకించే పార్టీ - కాంగ్రెస్ పార్టీ మిత్ర‌ప‌క్షం అయిన శరద్‌ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ చేతులు క‌లిపింది. త‌ద్వారా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే సామెత‌ను నిజం చేసింది.

మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌ లో ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకు గాను శివసేన 24 స్థానాల్లో గెలుపొందంగా... ఎన్సీపీ 18 స్థానాలు - బీజేపీ 14 స్థానాల్లో విజయం సాధించింది... మూడు పార్టీలు మేయర్ పదవి కోసం తమ అభ్యర్థులను నిలబెట్టారు. అయితే శివసేకు మేయర్ పదవి దక్కకుండా చేసేందుకు ఎన్సీపీ-బీజేపీ ఏకమై శివసేనకు ఝలక్ ఇచ్చాయి. బీజేపీ-ఎన్సీపీ - ఇతర  కార్పొరేటర్లు ఏకం కావడంతో బీజేపీ మేయర్ బాబా సాహెబ్‌ బలం 37 స్థానాలకు చేరింది... ఇది మ్యాజిక్ ఫిగర్ 35 కంటే రెండు స్థానాలు అధికం. దీంతో అధికారం బీజేపీ కైవ‌సం అయింది. అహ్మద్‌నగర్‌ మేయర్ పదవి కోసం బీజేపీ కార్పొరేటర్లు- నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి పీఠం కైవ‌సం చేసుకోవ‌డంతో అవాక్క‌వ‌డం శివ‌సేన శ్రేణుల వంతు అయింది.

కాగా, కొద్దికాలంగా బీజేపీ- ఎన్సీపీల మ‌ధ్య దోస్తీ కుదురుతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. బీజేపీని ముప్పు తిప్ప‌లు పెడుతోన్న రఫెల్ డీల్ విష‌యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ మోడీని వెనుకేసుకు వ‌చ్చారు. ఇటీవల ఓ మరాఠీ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో రఫెల్ డీల్ లో మోడీ తప్పేమి లేదని వ్యాఖ్యానించారు. అయితే మళ్లీ పార్టీ పవార్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. శరద్ పవార్ మోడీకి క్లీన్ చిట్ ఇవ్వలేదని స్పష్టం చేసింది.

కాగా, మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి వచ్చాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అప్పుడు ఎన్సీపీ 21 సీట్లలో పోటీ చేసింది. కాంగ్రెస్ 26 స్థానాల్లో పోటీకి నిలిచింది. మిగిలిన ఒక సీటుని చిన్న భాగస్వామ్య పార్టీకి వదిలేశారు. ఎన్సీపీ నాలుగు సీట్లలో గెలవగా కాంగ్రెస్ రెండింటిని మాత్రమే నెగ్గింది. దీంతో తమకు ఈ సారి సరిసమానంగా సీట్లు కేటాయించాల్సిందేనని ఎన్సీపీ పట్టుబట్టింది. భారతీయ జనతా పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు పొత్తు తప్పనిసరని భావించిన కాంగ్రెస్ అధినాయకత్వం ఎన్సీపీ డిమాండ్ కు అంగీకరించింది. మొత్తం 48 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ 24 స్థానాల్లో, ఎన్సీపీ 24 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించాయి. రెండు పార్టీలు తమ భాగస్వామ్య చిన్న పార్టీలకు తమ కోటా నుంచి సీట్లు కేటాయిస్తాయి.
Tags:    

Similar News