తెలంగానం : టీఆర్ఎస్ తో అపుడున్నదేంటి? ఇపుడు లేనిదేంటి?

Update: 2022-04-27 16:30 GMT
వ‌రుస ప‌రిణామాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి బీజేపీని. ఢిల్లీ, జ‌హంగీర్ పురిలో మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌కు పాల్ప‌డ్డారంటూ సంబంధిత వ్య‌క్తుల ఇళ్ల‌ను ఇంకా అక్ర‌మ నిర్మాణాలు అంటూ కొంద‌రు షాపుల‌ను బుల్డోజ‌ర్ తో కూల్చేసింది ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్.

ఇవ‌న్నీ మైనార్టీ వ‌ర్గాల‌కు చెందిన‌వే కావ‌డం, వీటి విష‌య‌మై క‌మ్యూనిస్టు పార్టీ నాయ‌కురాలు బృందా కార‌త్ స్పందించి సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే ఆర్డ‌ర్ తీసుకురావ‌డం అన్న‌వి చ‌క‌చ‌కా జ‌రిగిపోయిన ప‌రిణామాలు. కానీ ఆరోజు ప‌రిణామాల నేప‌థ్యంలో చాలా పార్టీలు మౌనం దాల్చాయి. కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మౌనం దాల్చింది. ఇదే అనేక విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

ఇక బుల్డోజ్ ఫార్ములా ద‌గ్గ‌ర‌కే వ‌ద్దాం..ఇదొక న‌యా వ్యూహం. అంటే పార్టీల‌ను పూర్తిగా భూ స్థాపితం చేయ‌డం. ఆ విధంగా బీజేపీకి ఎదురువెళ్లిన పార్టీల‌న్నింటినీ పూర్తిగా నామ రూపాలు లేకుండా చేయ‌డం.ఇదే సూత్రాన్ని అనుస‌రించి బీజేపీ ఎక్క‌డిక్క‌డ త‌న వారిని కాపాడుకుంటూ మిగ‌తా పార్టీలకు ఝ‌ల‌క్ ఇస్తోంది. మ‌రి!ఇవాళ తెలంగాణ వాకిట టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక‌లు అవుతున్నాయి. ఆ పార్టీ ఆవిర్భ‌వించి 21 ఏళ్లు పూర్త‌వుతున్నాయి.

ఓ చిన్న స్థాయి నుంచి అతి పెద్ద స్థాయికి పార్టీని తీసుకువెళ్లిన ఘ‌న‌త కేసీఆర్ ది. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర స‌మితిని న‌డిపించిన చాలా మంది ఇవాళ లేరు. ముఖ్యంగా సిద్ధాంత క‌ర్త ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ స‌ర్ లేరు. ఆయ‌న కాలం చేశారు. మ‌రో సైద్ధాంతిక వ్యూహ క‌ర్త ప్రొఫెస‌ర్ కోదండ రామ్ ఇవాళ ఆ పార్టీకి దూరంగా ఉన్నారు.

త‌న‌దైన శైలిలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో  కీల‌కం అనుకున్న వారెవ్వ‌రూ ఇవాళ కేసీఆర్ వెంట లేరు. ఉద్య‌మ కేంద్రం ఓయూలో విద్యార్థి రాజ‌కీయం కూడా పూర్తిగా మారిపోయింది. ఆ రోజు కేసీఆర్ అంటే ఎంతో ఇష్ట‌ప‌డిన ఓయూ జేఏసీ ఇప్పుడు కేసీఆర్ అంటే మండిప‌డుతోంది.

ఏ విధంగా చూసుకున్నా అమ‌రుల‌కు  వారి కుటుంబాల‌కు త‌గిన గౌర‌వం లేనేలేదు. కానీ మ‌ళ్లీ మ‌ళ్లీ కేసీఆర్ మాత్ర‌మే సీఎం అవుతార‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి చెబుతోంది.అందుకు తాము ప్ర‌వేశ పెట్టి అమ‌లు చేసిన ప‌థ‌కాలు, తాము చేసిన అభివృద్ధే దోహ‌ద‌ప‌డ‌తాయి అని  చెబుతోంది. మరి జనం దేన్ని నమ్మారో ఎన్నికలు అయితేనే తెలుస్తుంది.
Tags:    

Similar News