సర్ ప్రైజ్: గ్రేటర్ బరిలోఆ పార్టీ అభ్యర్థులే ఎక్కువ నేరచరితులట

Update: 2020-11-25 17:00 GMT
ఒక మహానగర స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలు జాతీయస్థాయి నేతలు రావటం ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశామా? తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగురవేసేందుకు అవసరమైన వాతావరణం ఇప్పుడిప్పుడే నెలకొంటుందన్న అంచనాలో ఉన్న బీజేపీ.. వచ్చిన అవకాశాన్ని ఏ రూపంలోనూ వదులుకోవటానికి ఇష్టం పడటం లేదు. అందుకే.. గ్రేటర్ ఎన్నికల్లో తన శక్తియుక్తులన్నింటిని వినియోగిస్తూ.. తన అధిక్యతను ప్రదర్శించాలని తహతహలాడుతోంది.

అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం వరకు అన్నింట్లోనూ తానే ముందుండాలని భావిస్తున్న ఆ పార్టీ.. తన కోర్ సిద్ధాంతాల్ని కాస్త పక్కన పెట్టేసిందని చెప్పాలి. ఇరవై ఏళ్ల క్రితం బీజేపీఅభ్యర్థి అంటే.. వంక పెట్టేందుకు వీలు లేని రీతిలో ఉండటం.. మిగిలిన రాజకీయ నేతలకు కాస్త భిన్నంగా ఉండటం చూస్తుంటాం. కానీ..ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

అధిక్యతను ప్రదర్శించటమే లక్ష్యమన్నట్లుగా బీజేపీ తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ మాటకు బలం చేకూరేలా కొన్ని అంశాలు తెర మీదకు వచ్చాయి. తాజాగా గ్రేటర్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో నేరచరిత్ర ఉన్న వారి వివరాల్ని వెల్లడించింది సుపరిపాలన వేదిక. అభ్యర్థుల నామినేషన్ పత్రాల్ని క్షుణ్ణంగా పరిశీలించి.. వారిచ్చిన సమాచారం ఆధారంగా వారు లెక్కలు తేల్చారు.

బరిలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో అత్యధికంగా నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు ఏ పార్టీకి చెందిన వారో తెలిస్తే.. ఆశ్చర్యపోవటం ఖాయం. మీ అంచనాలకు భిన్నంగా సుపరిపాలన వేదిక వివరాలు ఉండటం ఖాయం. ఇంతకీ అత్యధిక నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల పార్టీ బీజేపీగా తేల్చారు. మొత్తం బరిలో ఉన్న అభ్యర్థుల్లో 49 మంది నేర చరిత్ర ఉన్న వారు అయితే.. వారిలో బీజేపీకి చెందిన 17 మంది నేర చరిత్ర ఉన్న వారుగా తేల్చారు.తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. ఆ పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులు ఉండగా.. మజ్లిస్ లో ఏడుగురు అభ్యర్థులు నేర చరిత్ర ఉన్నట్లుగా తేల్చారు.

మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల్లో మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. కేసులు ఉన్న అభ్యర్థుల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. మరో విలక్షణమైన అంశం ఏమంటే.. మల్కాజిగిరి డివిజన్ లోని అభ్యర్థులందరికి నేర చరిత్ర ఉన్నట్లుగా పేర్కొన్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు 72తో పోలిస్తే.. ఈసారి కేసులు ఉన్న వారి సంఖ్య తగ్గటం గమనార్హం. కాకుంటే.. బీజేపీకి చెందిన వారు ఎక్కువగా ఉండటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News