బీజేపీకి ఐక్య ఉద్యమాలు ఇపుడు గుర్తుకొచ్చాయా?

Update: 2022-10-17 16:30 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి ఐక్య ఉద్యమాలు చేయాలని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన ప్రకటన చాలా విచిత్రంగా ఉంది. జనసేన-బీజేపీలు గడచిన మూడేళ్ళుగా మిత్రపక్షాలే. ఇప్పటికప్పుడు రెండు పార్టీలు కలిసి ఐక్య ఉద్యమాలు చేయాలని వీర్రాజు ప్రకటించటం ఏమిటి ? ఏమిటంటే ఈ మూడేళ్లలో రెండు పార్టీలు పేరుకు మాత్రమే మిత్రపక్షాలంతే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాన్ని కూడా రెండు పార్టీలు కలిసి చేసిందేలేదు.

రెండు పార్టీలు దేనికదే వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న పర్యటనల్లో ఎక్కడా బీజేపీ నేతలు కనబడటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన చేసిన నిరసనల్లో ఎక్కడా బీజేపీ నేతల భాగస్వామ్యం లేదు. ఇదే సమయంలో బీజేపీ ఆందోళనల్లో జనసేన నేతలు కనబడలేదు. అంటే మిత్రపక్షాలుగా ఉన్న రెండు పార్టీలు సమాంతర రేఖలుగా కంటిన్యూ అవుతున్నాయంతే.

రెండు పార్టీల నేతలు మీడియా సమావేశాల్లో మాట్లాడేటపుడు మాత్రం తాము మిత్రపక్షాలనే చెప్పుకుంటారు. ఈ కారణంగానే వచ్చే ఎన్నికల వరకు రెండు పార్టీలు కలిసుంటాయనే నమ్మకం కూడా ఎవరిలోను కనబడటం లేదు. రెండు పార్టీలు కూడా ఎప్పుడెప్పుడు విడిపోదామా అన్నట్లుగానే వ్యవహరిస్తున్నాయి.

అందుకనే ఎన్నికల నాటికి జనసేన మిత్రపక్షాన్ని వదిలేసి టీడీపీతో పొత్తుపెట్టుకుటుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇందులో వాస్తవం ఎంతనేది కాలమే చెప్పాలి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పవన్ కేంద్రంగా విశాఖపట్నంలో రాజకీయపరిణామాలు ఉద్రిక్తంగా మారాయి.

దీన్ని అవకాశంగా తీసుకోవాలని బీజేపీ అనుకున్నట్లుంది. వెంటనే వీర్రాజు మాట్లాడుతూ పవన్ కు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ రెండు పార్టీల ఆధ్వర్యంలో ఐక్యపోరాటాలు చేస్తామంటు ప్రకటించారు. తమ ఎంఎల్సీ మాధవ్ తో మాట్లాడి వెళ్ళి పవన్ ను కలిసి సంఘీభావాన్ని తెలపాలంటూ ఆదేశించారు.

రెండు పార్టీల మధ్య సఖ్యతే ఉంటే విశాఖలోనే ఉన్న బీజేపీ ఎంఎల్సీ మాధవ్ వెళ్ళి పవన్ను ఎందుకు కలవలేదో వీర్రాజు చెప్పాలి. మొత్తానికి ఇంతగోల మొదలైన తర్వాతైనా ఐక్యఉద్యమాలు చేస్తామని చెప్పటం సంతోషమే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News