బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ...పవన్ సంగతి ఏం చేస్తారో...?

Update: 2023-01-18 23:30 GMT
అంతా అనుకున్నదే జరుగుతోంది. ఏపీలో రాజకీయ పొత్తుల విషయంలో వ్యవహారం మెల్లగా ఒక కొలిక్కి వస్తోంది. ఏపీలో బీజేపీ జనసేనల మధ్య పొత్తు ఉంది. అది మూడేళ్ల క్రితం ఒక సంక్రాంతి తరువాత కుదిరింది. అయితే ఈ సంక్రాంతి తరువాత ఆ పొత్తు ఏమవుతుంది అన్నదే ఇపుడు ఆసక్తికరమైన చర్చ. ఈ నెల 24న భీమవరంలో జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఏదో ఒకటి తేల్చేస్తారుట.

అంతే కాదు ఏపీలో బీజేపీ రోడ్ మ్యాప్ ఏంటి అన్నది ఆ రోజే ప్రకటిస్తారు అని అంటున్నారు. ఏపీలో బీజేపీ సొంతంగా ఎదగాలని చూస్తోంది. దాని కోసం ఏం చేయాలి అన్నదే రోడ్ మ్యాప్ లో ఉంటుంది అని అంటున్నారు. పవన్ తో కలసి ముందుకు సాగుదామని చూసినా పవన్ అయితే ఇపుడు తెలుగుదేశం వైపే మొగ్గు చూపిస్తున్నారు. అంతే కాదు తన వెంట బీజేపీ కూడా వచ్చి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని కూడా ఆశిస్తున్నారు.

అయితే బీజేపీ జాతీయ పార్టీ. ఏపీలో ఏమీ కాకపోయినా దేశంలో బలంగా ఉంది రాజకీయ రూట్ ఫిలాసఫీ వేరేగా ఉంటాయి. అందుకే ఏపీలో సొంతంగా ఎదగాలీ అంటే ఏమి చేయాలి అన్నదే బీజేపీ ఆలోచిస్తుంది అని అంటున్నారు. తెలుగుదేశంతో కూడరాదు అని కూడా బీజేపీ కీలకమైన నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. ఇటీవల రెండు రోజుల పాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలలో కేంద్ర నాయకులు ఏపీ నేతలకు ఈ విషయం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

ఏపీలో తనకంటూ ఉన్న అవకాశాలను మరింతగా మెరుగుపరచుకుంటూ ఎలా ఎదగాలి అనేది ఇపుడు బీజేపీ చేయబోయే ఎక్సర్ సైజ్ అంటున్నారు. ఈ విషయాలు అన్నీ భీమవరంలో వివరిస్తామని చెబుతున్నారు సోము వీర్రాజు. ఆయన ఈ సందర్భంగా అన్న మాటలను చూస్తే మాత్రం ఏపీలో తెలుగుదేశంతో పొత్తు ఉండదనే అంటున్నారు. తాము కుటుంబ పార్టీలకు రాజకీయాలకు పూర్తి వ్యతిరేకమని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అంటే అక్కడికి తెలుగుదేశతో పొత్తు ఉండదనే అర్ధం అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే నరేంద్ర మోదీ విశాఖలో పవన్ తో ఏమి మాట్లాడారు అన్నది రివీల్ కాకపోయినా బీజేపీ రోడ్ మ్యాప్ తరువాత అసలు సంగతి అందరికీ తెలుస్తుంది అని అంటున్నారు. ఏపీలో బీజేపీ 2029ని టార్గెట్ గా పెట్టుకుంది అని అంటున్నారు. అప్పటికి రెండు బలమైన ప్రాంతీయ పార్టీలలో ఏదో ఒకటి ఎలిమినేట్ అయితే ఆ ప్లేస్ లోకి రావడానికి బీజేపీ చూస్తుంది అని అంటున్నారు.

ఇక తెలంగాణాలో చూస్తే 2023లోనే జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోంది అని అంటున్నారు. ఆ దిశగా చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తుంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే పొత్తుల విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో అసలు ఉండదని స్పష్టమైన సంకేతాలు కూడా నేతలను ఇచ్చారని అంటున్నరు. తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తు ఉంటుంది అన్న ప్రచారానికి కూడా బీజేపీ పెద్దలు తెర వేశారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఏపీలో బీజేపీని బలోపేతం చేసే విషయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వీయ పర్యవేక్షణలో సాగుతుంది అని అంటున్నారు. ఫిబ్రవరిలో అమిత్ షా ఏపీ టూర్ ఉంటుంది అని చెబుతున్నారు. ఆయన ఏపీలోని ఏ ఒక్క పార్టీని స్పేర్ చేయకుండా విమర్శిస్తారు అని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో వెళ్తే వెళ్లనీ ఆయన్ని పట్టించుకోవద్దు అన్న స్పష్టమైన సందేశం కూడా ఏపీ బీజేపీ నేతలకు కేంద్రం నుంచి అందింది అని అంటున్నారు. సో  ఇపుడు బీజేపీ రోడ్ మ్యాప్ ఏంటో తెలిస్తే ఎవరికి షాక్ అన్నది  కూడా అర్ధమవుతుంది అని అంటున్నారు.        



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News