బీజేపీ-ప‌వ‌న్‌.. పొత్తు ముగిసిన‌ట్టే.. సంకేతాలు ఇవే!

Update: 2021-09-08 00:30 GMT
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. నిన్న‌టి మిత్రుడు నేడు శ‌త్రువు కావొచ్చు. ఈరోజు శ‌త్రువు రేప‌టికి మిత్రుడూ కావొచ్చు. అవ‌స‌రం-అవ‌కాశం అనే ప్రాదిప‌దిక‌నే రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. పార్టీ ఏదైనా.. నాయ‌కులు ఎవ‌రైనా.. అవ‌కాశం, అవ‌స‌ర‌మే ప్ర‌ధానం. ఇప్పుడు ఏపీలోనూ ఇదే జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బీజేపీ-జ‌న‌సేన బంధంపై గ‌త కొన్నాళ్లుగా అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. ఇద్ద‌రి మ‌ధ్య పొస‌గ‌డం లేద‌ని.. ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు ఊడుతుందో తెలియ‌ని బంధంగా మారింద‌ని విమ‌ర్శ‌లు..వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం.. పార్టీలు క‌లిసినా.. నాయ‌కులు క‌ల‌వ‌డం లేదు. నాయ‌కులు క‌లిసినా.. వ్యూహాలు క‌లవ‌డం లేదు.

ఏపీలో పుంజుకుని.. అధికారంలోకి రావాల‌నేది.. బీజేపీ వ్యూహం.. ఇదే జ‌న‌సేన వ్యూహం కూడా. అయితే.. కొన్ని విష‌యాల్లో ఈ రెండు పార్టీల మ‌ధ్య అంత‌రాలు ఏర్ప‌డ్డాయి. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. బీజేపీతో చేతులు క‌లిపిన ప‌వ‌న్‌.. ఈ బంధంతో ఆయ‌న సంపాయించుకున్న ఇమేజ్ క‌న్నా.. పోగొట్టుకున్న‌దే ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. స్థానిక ఎన్నిక‌ల్లో బీజేపీ స‌హ‌క‌రించ‌లేదు. తిరుప‌తి ఉప ఎన్నిక‌లోనూ.. త‌న దారిలో త‌ను న‌డిచి.. ప‌ట్టుబ‌ట్టి.. టికెట్ సంపాయించుకున్నారు బీజేపీ రాష్ట్ర నాయ‌కులు. అయితే.. నోటాకు వ‌చ్చిన ఓట్లు కూడా సంపాయించుకోలేక పోయారు. ఈ వైఫల్యం ఎవ‌రి ఖాతాలో వేయాల‌నే ప్ర‌శ్న వ‌చ్చింది.

ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ వ‌చ్చి ప్ర‌చారం చేసినా.. తాము ఓడిపోవ‌డం పై దృష్టి పెడుతున్నామంటూ.. బీజేపీ నాయ‌కులు న‌ర్మ‌గ‌ర్భంగా.. ఈ ఓట‌మి తాలూకు ఫ‌లితాన్ని ప‌వ‌న్‌పై వేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఇక‌, అక్క‌డి నుంచి కూడా ఇరు పార్టీల మ‌ధ్య అంత‌రం పెరుగుతూ వ‌చ్చింది. ఇక‌, రెండు పార్టీలు కూడా ఏపీ ప్ర‌భుత్వంపై స‌మ‌రం చేస్తున్నా.. క‌లివిడి లేని పోరునే సాగిస్తున్నాయి. మైనార్టీ హ‌క్కుల విష‌యంలో జ‌న‌సేన ఉద్య‌మిస్తే.. టిప్పు సుల్తాన్  విగ్ర‌హ స్థాప‌న విష‌యంలోబీజేపీ ఒంట‌రిగానే పోరు చేసింది. త‌ర్వాత ర‌హ‌దారుల‌పై గుంత‌లు, కొత్త ర‌హ‌దారుల నిర్మాణం విష‌యంలో ప‌వ‌న్ దూకుడుగా విమ‌ర్శ‌లు చేసి.. రాష్ట్రంలో పార్టీ నేత‌ల‌ను రంగంలోకిదింపి ధ‌ర్నాలు చేయించారు.

ఈ విష‌యంలో బీజేపీ దూరంగా ఉంది. ఇక‌, ఎస్సీల‌పై దాడుల విష‌యంలో కొన్నాళ్ల కిందట జ‌రిగిన ఉద్య‌మానికి జ‌న‌సేన ముందుకు వ‌స్తే.. బీజేపీ దూరంగా ఉంది. ఇప్పుడు వినాయ‌క చ‌వితి వేడుక‌ల విష‌యంలో బీజేపీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తే.. జ‌న‌సేన దూరంగా ఉంది. క‌లిసి పోరాటం చేస్తామంటూ.. రెండు వారాల కింద‌ట‌.. రెండు పార్టీలూ సంయుక్త ప్ర‌క‌ట‌న చేసినా.. ఆ క‌లివిడి.. కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమిత‌మనే సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. దీనికి జ‌న‌సేన‌కు రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి బీజేపీ ఇప్పుడు ఎదిగే ప‌రిస్థితి లేదు. దీనికి కార‌ణం.. రాష్ట్రంలో బ‌లంగా ఉన్న అధికార పార్టీ మ‌ద్ద‌తు కోసం.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

 వ‌చ్చేఎ న్నిక‌ల్లో కేంద్రంలో మ‌రోసారి అధికారం ద‌క్కించుకోవాలంటే.. వైసీపీ మ‌ద్ద‌తు అవ‌స‌రమ‌ని భావిస్తున్నారు. సో.. ఇప్పుడు బీజేపీ చేసే ఉద్య‌మాలన్నీ.. కాగితం పుల‌ల మాదిరిగానే ముందుకు సాగుతాయి. ఈ నేప‌థ్యంలో తాను బీజేపీతోనే ఉంటే.. తీర‌ని న‌ష్టం వాటిల్ల‌డం ఖాయం. మ‌రోకార‌ణం.. త‌న వ్య‌క్తిగతంగా పుంజుకోవాలంటే.. ఇప్ప‌టికిప్పుడు క‌ద‌న‌రంగంలోకి దూకాల్సిందే. బీజేపీతో అంటిపెట్టుకుని ఉంటే.. మైనార్టీ, ఎస్సీ వ‌ర్గాలు దూరం అవుతాయి. సో.. ఈ రెండు కార‌ణాలతో జ‌న‌సేన డిస్టెన్స్ మెయింటెన్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇదే.. కొన్ని రోజులుగా ఇరు పార్టీల మ‌ధ్య కూడా క‌నిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఎవ‌రికి వారుగా రాజ‌కీయాలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే.. ప‌వ‌న్ కు మ‌రో పార్టీ ఆహ్వానం ప‌లుకుతోంద‌ని.. రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News